యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో రెండో సారి అదికారంలోకి రావాలని కలలు కన్న టీడీపీకి ఘోర పరాజయంతో ఆ ఆశలు కల్లలయ్యాయి. కనీసం ఎంత ఓడిపోయినా.. సగానికి సగమైనా సీట్లు గెలుచుకుంటుందని కొందరు
నాయకులు భావించారు. అయితే, 175 స్థానాల్లో కనీసం పాతిక సీట్లలో కూడా టీడీపీ విజయం సాదించలేక పోయింది. అనేక పథకాలు, సంక్షేమాలు, పసుపు కుంకుమ పేరుతో నగదు పంపిణీ వంటివి ఏవీ కూడా టీడీపీకి అధికారాన్ని అందించలేక పోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు రాష్ట్ర టీడీపీని సరైన మార్గంలో నడిపించలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర టీడీపీ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కళా వెంకట్రావుకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ఇచ్చారు. ముఖ్యంగా మరోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని గట్టెక్కించాలని చంద్రబాబు అనేక రూపాల్లో దిశానిర్దేశం చేశారు. అధికారాలు అప్పగించారు. అయినప్పటికీ.. తనదైన శైలినిగానీ, తనకో విజన్ కానీ లేకుండా కళా వ్యవహరించారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇక, ఏపీలో ఇంతటి ఘోర పరాజయం తర్వాత ఈ ఓటమికి ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా అతిచిన్న పార్టీగా మారిపోవడాన్ని పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలో ఎవరు ఏపీలో టీడీపీ ఓటమికి బాధ్యత వహిస్తారు? అంటే.., ఇప్పటి వరకు కూడా కళా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనినిబట్టి ఆయనకు ఈ పదవిని వదులుకోవాలని లేదని అంటున్నారు టీడీపీలోని ఓ వర్గం నాయకులు. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితిలోనూ కళాను తప్పించాలనే విమర్శలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వినిస్తున్నాయి. పార్టీని యువ నాయకత్వానికి అప్పగించాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.సుమారుగా టీడీపీ ఆవిర్భావం
నుంచి ఉన్నప్పటికీ కళా వెంకట్రావు పార్టీకి చేసింది ఏమీలేదని అనేవారు కూడా ఉన్నారు. మధ్యలో పార్టీ మారి, మరోసారి టీడీపీలోకి వచ్చినా.. చంద్రబాబు ఆయనకు కీలక పదవిని అప్పగించారు. అయినా కూడా పార్టీ యోగక్షేమాలు కానీ, అభివృద్ధి కోసం కానీ ఆయన చేసింది ఏమీ లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గౌరవంగా ఆయన తప్పుకొని యువరక్తానికి అవకాశం ఇస్తే… సరి.. లేదంటే.. తాము తప్పిస్తామనే నాయకులు రెడీ అవుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. తాజా ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన కళా మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా గొర్లె కిరణ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా కష్టమే అన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.