సోనియా గాంధీ… కుమారుడిని ప్రధానమంత్రి పదవిలో చూడాలన్న ఆమె కోరిక ఈసారి కూడా తీరలేదు. పైగా తమకు పట్టున్న ప్రాంతంలో రాహుల్ గాంధీ ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేధీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అమేధీ తమ పార్టీకి, కుటుంబానికి కంచుకోట అయినప్పటికీ ఎందుకు ఓటమికి గల కారణాలపై ఆమె లోతుగా అధ్యయనం చేశారు.మోదీ హవాతోనో, బీజేపీ అభ్యర్థి పై క్రేజ్ తోనే రాహుల్ ఓటమి పాలు కాలేదని అంతర్గత నివేదికలు అందినట్లు తెలుస్తోంది. రాహుల్ ఓటమికి ప్రధాన కారణం రాహుల్ అమేధీని పట్టించుకోకపోవడమేనన్నది వాస్తవం. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేధీ నుంచి గెలిచిన తర్వాత ఐదేళ్లలో కేవలం 17 సార్లు మాత్రమే పర్యటించారు. అమేధీ నియోజకవర్గంలోని సమస్యలపై కూడా రాహుల్ దృష్టి పెట్టలేదు. జాతీయ నేత కావడంతో ఎక్కువగా దేశ సమస్యలపైనే ఆయన పోరాటం చేశారు.దీనికి తోడు స్మృతి ఇరానీ అమేధీలో గత ఎన్నికల్లో ఓటమిపాలయినా, కేంద్రమంత్రిగా ఉండి అక్కడే తిష్టవేశారు. ఈ విషయాన్ని గ్రహించిన సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గెలవలేకపోవడంపై అక్కడి స్థానిక నేతలపై
సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా, రాహుల్ కు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కొందరు స్థానిక కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టినట్లు సమాచారం.అందుకే సోనియా గాంధీ తాను విజయం సాధించిన రాయబరేలి నియోజకవర్గం లో పర్యటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క స్థానం రాయబరేలి. రాహుల్ చేసిన తప్పు తాను చేయకూడదనుకున్నారో…? ఏమో… సోనియాగాంధీ రాయబరేలీలో పర్యటించారు. అక్కడి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సోనియాగాంధీ రాయబరేలీలో పర్యటించడం ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి. ఆమె ఆరోగ్యం సహకరించకున్నా ప్రజలకు దూరం కాకూడదనే ఆమె రాయబరేలీ పర్యటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి