ఏపీ అసెంబ్లీలో ఫిరాయింపులపై అధికార-విపక్షాలు మాటలు తూటాల రూపంలో ప్రయోగించాయి. టీడీపీ అన్యాయంగా తమ పార్టీ నుంచి 23మంది చేర్చుకుందని వైసీపీ టార్గెట్ చేసింది.. జగన్ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచింది.. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబులా తాను ఆలోచించి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదాలో కూడా ఉండేవారు కాదన్నారు. తాను ప్రలోభాలు పెట్టి ఉంటే.. మంత్రి పదవులు ఇస్తానంటే.. టీడీపీ నుంచి తనతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెబితే.. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. ఒకవేళ టీడీపీ నుంచి ఎవరైనా వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. పదవికి రాజీనామా చేయని పక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసి మరీ అనర్హత వేటు వేయిస్తామన్నారు. విశ్వసనీయత, విలువులు ఉన్న రాజకీయాలు మాత్రమే చేస్తామన్నారు జగన్. ఎవరైనా పార్టీలోకి వస్తే పదవికి రాజీనామా చేయాలని చెప్పేశారు.. అంటే ఉప ఎన్నికలు వస్తాయని సంకేతాలు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే జగన్ దారిలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కొత్త సంకేతాలు ఇచ్చారు. ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న ఆయన.. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. చంద్రబాబుకు భవిష్యత్ లేదని.. ఆయన మారరని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అటు వైఎస్ జగన్ పార్టీలోకి ఎవరైనా వస్తే పదవికి రాజీనామా చేయమని చెబుతామనడం.. ఇటు వైసీపీ ఎమ్మెల్యే కూడా 8మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనడం ఆసక్తి రేపుతోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల చూపు వైసీపీ వైపు ఉందనే చర్చ మొదలయ్యింది. అదే జరిగితే.. వైసీపీకి వెళ్లదలచుకున్న ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఏపీలో ఉప ఎన్నిక ఖాయమనే సంకేతాలు వచ్చినట్లే. మరి ఈ 23మంది టీడీపీ ఎమ్మెల్యేలలో పార్టీలో కొనసాగేదెవరు.. గోడ దూకేదెవరో చూడాలి.