భారత్ త్వరలోనే సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయనుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. గగన్ యాన్ మిషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయుణ్ని పంపడం కోసం గగన్ యాన్‌ను చేపడుతున్న సంగతి తెలిసిందే. సొంత స్పేషన్ స్టేషన్ ఏర్పాటు దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయని శివన్ తెలిపారు. ఢిల్లీలో అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇస్రో చైర్మన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రయోగాలకు ఉపయోగించడానికి వీలుగా చిన్న స్పేషన్‌ను ఏర్పాటు చేస్తామని శివన్ చెప్పారు. స్పేస్ టూరిజం దిశగా ఆలోచించడం లేదన్నారు. ఇస్రో చంద్రయాన్-2ను జూలై 15న చేపడుతున్న సంగతి తెలిసిందే. భారత్ 2008లో కేవలం రూ.514 కోట్లతో చంద్రయాన్‌ను చేపట్టింది. సూర్యుడిపై అధ్యయనం కోసం 2020లో ఆదిత్య ఎల్1ను చేపడతామని ఇస్రో వెల్లడించింది.