ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పనులను అన్ని సంఘాల్లో ఉన్న ప్రతి ఉపాధి కూలి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోడుమూరు గ్రామ
పంచాయతీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.41 లక్షల అంచనాతో 20 *18 సైజులో ఉపాధి కూలీలతో నిర్మిస్తున్న డగ్ ఔట్ పాండ్ ను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీల మస్టర్ ను పరిశీలించి పేర్లు చదివి హాజరును పరిశీలించారు. ఎంత ఎన్ని గంటలు పనిచేస్తారు. ఎంత కూలీ గిట్టు బాటు అవుతుంది. మజ్జిగ, ఫస్ట్ ఎయిడ్ కిట్, నీడను కల్పించే షేడ్స్ ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారా అని అడిగారు. రోజు రూ.230లు కూలీ వస్తుందని, మజ్జిగ ఇస్తున్నారని, ఐదు నెలల కూలీ డబ్బులు రావాల్సి ఉందని కలెక్టర్ కు ఉపాధి కూలీలు తెలిపారు. పెండింగులో ఉన్న బిల్లులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 1.65 లక్షల లేబర్ టర్న్ ఔట్ ఉందని, దీనిని 3 లక్షల టర్న్ ఔట్ సాధించడానికి ప్రణాళికా బద్దంగా పనిచేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే వారంలో ఉపాధిహామీ పథకం పై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది రెండవ క్షేత్ర స్థాయి పర్యటన అని అన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలు అవుతున్నాయి. పనులు నాణ్యత ఎలా ఉంది. వేతనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలిస్తున్నామన్నారు.
అంతకుముందు కోడుమూరులో ఉన్న 13 వ నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. ఎంతమంది హాజరయ్యారని అంగన్వాడీ టీచర్ సుశీలమ్మను కలెక్టర్ అడిగారు. ఎంతమంది ఈ కేంద్రం నుండి పాఠాశాల విద్యకై పాఠశాలలో చేరారని అడుగగా ఐదు మంది విద్యార్థులు చేరారని ఆమె కలెక్టర్ కు విన్నవించారు. పౌష్టికాహారం గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కోడిగుడ్లు నిర్దేశించిన మేరకు అందుతున్నాయా అని ఆరా తీశారు. గుడ్లను బార్ కోడ్ విధానంతో ఎలా గుర్తిస్తారని ప్రశ్నించంగా , అంగన్వాడీ టీచర్ తన సెల్ ద్వారా గిర్తించే విధానాని వివరించారు. ఈ కార్యక్రమంలో ద్వామా పీడి వెంకటసుబ్బయ్య, ఎంపిడివో సుధా, ఎంపిడిఓ, తహసీల్దార్, అంగన్వాడీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.