యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నివాసానికి వచ్చి కలిసారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు 1981-82లో పోలవరం ప్రారంభమైందని, ఈ ప్రాజక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు రాష్ట్రానికి తోడ్పాటునందించాలని కోరారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమని తెలిపారు. నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని వెంకయ్యనాయుడు గజేంద్ర సింగ్ షెకావత్‌కు సూచించారు.
రూ.3,000 కోట్లు విడుదల చేయాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరిందని ఈ సందర్భంగా వెంకయ్య వెల్లడించారు. ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వెంకయ్య కేంద్ర మంత్రికి సూచించారు. నిధుల కొరతతో ప్రాజక్టు ఆలస్యం కారాదన్నదే తన అభిమతం అని స్పష్టం చేశారు. ప్రాజక్టు విస్తరణలో అడ్డంకులపై పర్యావరణశాఖతో మాట్లాడాలని మంత్రికి సూచించారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనలపై కేంద్రమంతి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఆర్థికశాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్టు సమాచారం.