యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మరోసారి పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని అదుపు చేయాలన్నారు. కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సమ్మిట్‌లో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే మోదీ తన హెచ్చరికలు కొనసాగించారు. అయితే మోదీ ఎక్కడా తన ప్రసంగంలో పాకిస్థాన్ పేరును ప్రస్తావించలేదు. భారత్‌ను నిర్వీర్యం చేసేందుకు ఓ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా గత కొన్నేళ్లుగా జరుగుతోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న, మద్దతు ఇస్తున్న దేశాలనే బాధ్యుల్ని చేయాలని మోదీ అన్నారు.ఈ సందర్బంగా మోదీ అన్ని దేశాల నేతలతో మాటలు కలిపారు గానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాత్రం మాట్లాడలేదు.సమావేశం అనంతరం కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్‌ఈవోలో పాల్గొన్న అందరూ నేతలూ పాల్గొన్నారు. ఇక్కడ మోదీ, ఇమ్రాన్ ఖాన్ కలిసి కూర్చోలేదని సమాచారం. అంతేకాదు విందు సమయంలోనూ ఇద్దరు ప్రధానులు కుశల ప్రశ్నలు వేసుకోలేదని ఓ ప్రముఖ ఆంగ్లమీడియా తెలిపింది. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్‌సీవో వేదికగా మోదీ అన్ని దేశాల నేతలతో సమావేశమవనున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్‌తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తోంది. ఎస్‌సీవో సదస్సు ప్రారంభానికి ముందు కలిసి చర్చించుకుందామని పాక్ ప్రధాని ఇమ్రాన్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇద్దరూ భారత్‌కు విడివిడిగా లేఖలు రాశారు.