Highlights
- 14 వ తేదీ నుంచి అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 515వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద ఈ నెల 13వ తేదీ న టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6.00 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. తితిదే ఉన్నతాధికారులు,రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు..
అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.