YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నో క్యాష్.. ఉంటే బ్యాంకులకు జరిమానా

నో క్యాష్..  ఉంటే బ్యాంకులకు జరిమానా

ఖాతాదారులను వెక్కిరిస్తూ ఏటీఎంల ముందు తరచూ తగిలించే బోర్డు ఇది. నగదు కోసం ఏటీఎంలకు వెళ్లే వారు తరచూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలలో రోజుల తరబడీ నగదు ఉండకపోవడం పరిపాటైన విషయమే. వినియోగదారులకు తరచూ చికాకు కల్గిస్తున్న ఈ విషయంపై భారత కేంద్రీయ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎంలు 3 గంటలకు మించి నగదు లేకుండా ఉండరాదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని.. ఆర్బీఐ పేర్కొంది. ప్రాంతాలు, రీజియన్లను బట్టి ఈ జరిమానాలు ఉంటాయని తెలిపింది. అతి త్వరలోనే ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటీఎంలలో గంటల తరబడి, రోజుల తరబడి నగదు నిల్వలు లేకపోవడంతో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా అటు బ్యాంకులపైనా ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవానికి ఏటీఎం యంత్రంలో అమర్చిన సెన్సార్ల ద్వారా అందులో నగదు నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే.. ఏటీఎంలో కరెన్సీ
అయిపోయినా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనే ఖాతాదారులకు ఆర్‌బీఐ
వార్తతో కాస్త ఊరట లభించినట్లైంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. అటు ఏటీఎం ఛార్జీలు, ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలపై ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఈ విధానాన్ని పూర్తిగా సమీక్షించనున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించాయి

Related Posts