యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కీలకమైన రాజధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రదర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజయంసాధించిన కీలక నాయకులకు వైసీపీ అధినేత, సీఎం జగన్ గట్టి భరోసా ఇచ్చారు. సామాజిక వర్గాల ఈక్వేషన్ చక్కగా కుదిరేలా మంత్రి వర్గంలో చోటు కూడా కల్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంటనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విషయంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు విజయవాడ నగర పరిధిలో ఉన్నాయి. మొత్తం స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల విజయవాడ తూర్పు, గన్నవరం తప్ప మిగిలిన స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.హోరా హోరీ అనుకున్న స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా చర్చకు వచ్చింది. ఇక, ఇక్కడ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి జగన్ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించిన కొడాలి వేంకటేశ్వరరావు, ఉరఫ్ నాని(కమ్మ), మచిలీ పట్నం నుంచి విజయం సాధించిన పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ నాని(కాపు), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు (వైశ్య)లకు మంత్రి వర్గంలో కీలక శాఖలను అప్పగించారు. దీంతో జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ముగ్గురిపైనే పడిందని అంటున్నారు పరిశీలకులు.రాజధాని గుంటూరే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా చూసుకుంటే.. విజయవాడ,
మచిలీపట్నం కేంద్రాలు జోరుగా ఉన్నాయి. దీంతో జిల్లాలో టీడీపీ గతంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దుర్గగుడిఫ్లైవోర్, బెంజిసర్కిల్ ఫ్లైవోర్ సహా మచిలీపట్నం పోర్టు వంటివి కీలకమైన ప్రాజెక్టులు వీటిని అభివృద్ధి చేయడంతోపాటు.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రుల ముందు ఉన్న ప్రధాన విషయం. పదిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా కంచుకోటగా ఉంటూ వస్తోంది. గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి గాలి వీచినప్పుడు కూడా ఈ జిల్లాలో టీడీపీకే మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ కంచుకోటను బద్దలు కొట్టిన క్రమంలోనే జగన్ ఆ జిల్లాలో పార్టీ నేతలే ఊహించని విధంగా ఏకంగా మూడు కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ మంత్రులపై ఉంది. మరి ఈ విషయంలో ఈ ముగ్గురు ఏమేరకు విజయం సాధిస్తారు? జగన్ ఆశలను ఏమేరకు నెరవేరుస్తారు? అనే అంశాలు చర్చకు
వస్తున్నాయి.