యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దెబ్బతిన్న పులి కాచుక్కూర్చోని ఉంటుంది. అదనుకోసం వేచి చూస్తుంది. సమయం దొరకగానే వేటాడేస్తోంది. ఇదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీపై సోషల్ మీడియాలో విన్పిస్తున్న కామెంట్స్. నిజమే… గత కొద్ది రోజులుగా మమత బెనర్జీ దూకుడు పెంచారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె మరీ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఒకవైపు పాలనను చూసుకుంటూనే మరోవైపు పార్టీని పటిష్టపర్చేందుకు మమత తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మమత భారతీయ జనతా పార్టీకి వార్నింగ్ పంపారు. బెంగాల్ బొమ్మ కాదని, దాంతో మీరు ఆడుకోలేరని మమత ఫైర్ అయ్యారు. బెంగాల్ లో శాంతిభద్రతలు అదుపు తప్పలేదని ఆమె పదే పదే స్పష్టం చేస్తున్నారు. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ యోచిస్తుందని కూడా ఆమె కార్యకర్తల సమావేశాల్లో చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బెంగాల్ లో 18 లోక్ సభ స్థానాల్లో గెలవడంతో బీజేపీ బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరో రెండేళ్లలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే బీజేపీ బెంగాల్ ను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. బెంగాల్ లో మొత్తం 294 స్థానాలున్నాయి. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్
ఫిగర్ 151 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపీ ఇక్కడ మిషన్ 250 గా అప్పుడే కమలనాధులు కార్యక్రమాన్ని ప్రారంభించేశారు.ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్యాడర్ పశ్చిమ బెంగాల్ తో
తిష్టవేసింది. గ్రామ స్థాయి కమిటీలను కూడా కమలం పార్టీ నియమించుకుంటోంది. ఇవన్నీ గమనించి మమత ఇక ఎఫెన్స్ లో వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే మమత మాటల దాడికి దిగుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఏమాత్రం అవకాశమిచ్చినా కమలం పార్టీ చొచ్చుకుపోతుందన్న భయంతో్నే మమత పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని కమలం పార్టీ ఆరోపిస్తోంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఏడాదిన్నరకు ముందే రాజకీయం వేడెక్కింది.