యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తనకు అన్ని నియోజకవర్గాలను కట్టబెట్టిన జిల్లాకు జగన్ అరుదైన గౌరవం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో రెండు మంత్రి పదవులతో పాటు ప్రొటెం స్పీకర్ బాధ్యతలను కూడా జగన్ అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా జిల్లా ప్రజలు ఫ్యాన్ పార్టీకి అప్పగించేశారు. దీంతో జగన్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విజయనగరం జిల్లాతో పాటు కర్నూలు, కడప, నెల్లూరుల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ వెనుకబడిన విజయనగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు.విజయనగరం జిల్లా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. అయితే జగన్ తన మంత్రి వర్గంలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, మరో మంత్రి పదవి ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవి దక్కడం జిల్లా చరిత్రలో ఇదే ప్రధమం. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణిని డిప్యూటీసీఎంగా చేశారు. గిరిజన మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇక పార్టీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు జగన్. బొత్స సత్తిబాబుకు ప్రభుత్వంలోనూ
మంచి గుర్తింపు లభించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఇక ప్రొటెం స్పీకర్ గా శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని ఎంపిక చేశారు. శంబంగి చిన అప్పలనాయుడు బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణ రంగారావును ఓడించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శంబంగిని ఎంపికచేయడంలో ఆయనతో పాటు జిల్లాకు గుర్తింపు నిచ్చినట్లయిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. శంబంగి కన్నా సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనను ఎంపిక చేయడంతో గౌరవం దక్కిందంటున్నారు. నిజానికి ప్రొటెం స్పీకర్ పదవి తాత్కాలికమే అయినప్పటికీ దానిని గౌరవంగా భావిస్తారు.గతంలో విజయనగరం జిల్లా నుంచి మాజీ మంత్రులు కోళ్ల అప్పలనాయుడు, పెనుమత్స సాంబశివరాజు, పతివాడ నారాయణస్వామిలు ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించారు. శంబంగి 174 మంది శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గిరిజన శాఖ, కీలకమైన మున్సిపల్ శాఖ జిల్లాకు రావడంతో జిల్లా అభివృద్ధి పరుగులు తీస్తుందన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా విజయనగరం జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశిద్దాం