యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడ సెంట్రల్ ఎన్నిక ఫలితంపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే, దీనిపై టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లాది ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి, తనపై 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని గమనించానని బోండా న్యాయస్థానానికి విన్నవించారు. ఈ విషయమై మే 23నే జిల్లా ఎన్నికల అధికారికి వినతి సమర్పిస్తూ ఫలితాల ప్రకటనకు ముందే వీవీప్యాట్ల లెక్కింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తన పిటిషన్‌పై ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని హైకోర్టును ఉమా కోరారు. బోండా
దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇందుకు సంబంధించిన ప్రతులను ఈసీ తరఫు న్యాయవాదికి అందజేయాలని పిటిషనర్‌కు సూచించింది. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. కాగా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజున ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ ఆధిక్యత ప్రదర్శించిందని, 13వ రౌండ్ లెక్కింపు సమయంలో అధికారులు తమను అయోమయానికి గురి చేసి, చివరకు ఓడిపోయినట్లు ప్రకటించారని ఆమె ఆరోపించారు. టీడీపీ అనుకూలంగా వచ్చిన 388 పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కించలేదని, మరి కొన్నింటిని చెల్లనివిగా ప్రకటించారన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కొందరు అధికారులు వైసీపీకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు.