యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చేస్తోన్న పోస్ట్‌లతో టీడీపీలో కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటరీ పదవుల నియామకంపై అలకబూనిన ఆయన, లోక్‌సభలో ఉపనేత, విప్ పదవులను చంద్రబాబు కట్టబెట్టినా ఆయన తిరస్కరించారు. దీంతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను చంద్రబాబు ఆయన వద్దకు పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అధినేత నేరుగా రంగంలోకి దిగి కేశినేనిని పిలిపించి మాట్లాడారు. బాబుతో భేటీ తర్వాత కాస్త వెనక్కుతగ్గినట్టు కనిపించినా మళ్లీ కొత్త పోస్టులతో సంచలనం రేపారు. తాజాగా, దీనిపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చూస్తుంటే ఆయన అసంతృప్తికి గురయ్యారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయన అసంతృప్తికి కారణం ఏదో ఒకటి ఉంటుందని, బయటకు వ్యక్తం చేస్తున్నవి మాత్రం వేరే కారణాలు అయి ఉంటాయని గల్లా అభిప్రాయపడ్డారు. ఆ కారణాలను తెలుసుకుని పరిస్థితిని చక్కదిద్దుతామని ఆయన తెలిపారు. విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. కేశినేని తీరు టీడీపీ
అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఆయన టీడీపీలో ఒక రకంగా అసమ్మతి నేతగా మారారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే వైఖరితో ఉన్నారు. ఏపీలో ప్రయివేటు బస్సుల విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం పోరాడితే పోయేదేమీ లేదంటూ పోస్ట్ పెట్టి..తాను టీడీపీలోనే ఉంటూ పోరాటం చేయాలనే నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. నాలుగు రోజుల కిందట జగన్ వైసీపీ నేత, మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి’ అని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అసలు లక్ష్యం మాజీ మంత్రి దేవినేని ఉమా అనే విషయం
స్పష్టమవుతోంది.