యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అనూహ్యంగా 2014 ఎన్నికలలో విశాఖ నుంచి లోక్ సభకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు ఆ పార్టీ మళ్ళీ గౌరవం ఇస్తుందా, ఆయన సేవలను ఉపయోగించుకుంటుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు అయిదేళ్ళ పాటు ఏపీకి బీజేపీ అధ్యక్షుడుగా వ్యవహరించిన హరిబాబు టీడీపీతో దోస్తీని గట్టిపరచడానికి బాగా ఉపయోగపడ్డారని చెప్పాలి. ఎపుడైతే విభేదాలు రెండు పార్టీల మధ్య రాజుకున్నాయో అపుడే హరిబాబు పదవికి ఎసరు తప్పదని భావించారు. దానికి తగినట్లుగానే ఆయన్ని మాజీని చేసేశారు. ఇక తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీగా కూడా మిగిలారు.ఇక ఏపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీలో సీనియర్ నాయకులకు పార్లమెంట్ ప్రాతినిధ్యం అసలు లేదని చెప్పాలి. గత లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఏపీ నుంచి కనిపించారు. ఇపుడు అదీ లేకపోవడంతో ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీకి స్థానికంగా ఉన్న నేతలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత, మేధావిగా గుర్తింపు ఉన్న హరిబాబును రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసి కీలకమైన బాధ్యతలు అప్పగించాలని పార్టీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వీలైతే
ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారం సాగుతోంది.ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఓ బలమైన సామాజికవర్గం రాజకీయ
ప్రాపకం కోసం పక్క చూపులు చూస్తోంది. . సరిగ్గా ఈ సమయంలో హరిబాబును ముందు పెడితే ఆ వర్గం బీజేపీ వైపుగా చూసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. హరిబాబు కు పదవి ఇవ్వడం ద్వారా తాము ఆ వర్గానికి ఉన్నామన్న భరోసా కల్పించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ దఫా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అవకాశం లేకుండా పోయింది. హరిబాబును కేంద్ర మంత్రిని చేసి ఆ లోటుని పూడ్చాలని పార్టీ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.