యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలకు కొదువేలేదు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు. స్వామికి భక్తులు ఇచ్చే కానుకులను మాత్రం లెక్కగట్టేందుకు కొన్ని శాసనాలు రికార్డులు ఉన్నాయి. ఒకప్పుడు దాతలు ఇచ్చిన కానుకలే స్వామి సేవలకు వినియోగించేవారు. కైంకర్యాలు మొదలుకుని, ఆభరణాల వరకూ చాలా సామాగ్రి దాతలు ఇచ్చినవే కావడం విశేషం. ఈ కానుకలకు చరిత్ర ఉంది. ఇలా తొలికానుక ఇచ్చిన వారు పల్లవరాణి సమువాయిగా చెబుతున్నారు. సమువాయి స్వామికి పరమభక్తురాలు. ఆమె తరచూ శ్రీవారిని దర్శించుకునేవారు. అలా అక్కడ స్వామి సేవకు కావలసిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె కీ.శ.614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. నాటి పల్లవుల నుంచి రాయల వరకు ఎన్నో కానుకలను ఇచ్చారు. తాజాగా, శ్రీవారి కాంచనాభరణ సంపత్తిలో శనివారం మరో రెండు ఆభరణాలు చేరతున్నాయి. తమిళనాడులోని తేనికి చెందిన తంగదొరై అనే భక్తుడు 5.5 కిలోల బరువు గల బంగారు హస్తాలను శుక్రవారం రాత్రి తిరుమలకు తీసుకువచ్చారు. దాదాపు రూ.2.5 కోట్ల
విలువైన స్వర్ణ కటి హస్తం, అభయహస్తం శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం టీటీడీ అధికారులకు అప్పగించారు. తంగదొరై గతంలోనూ శ్రీవారికి స్వర్ణాభరణం కానుకగా అందించారు. భక్తులు నిలువుదోపిడీ, స్వర్ణాభరణాల రూపంలో అర్పించుకుంటున్న బంగారు కానుకలే సగటున రోజుకు 2 కిలోలు.. అంటే ఏడాదికి దాదాపు 700 కేజీలు స్వామికి అందజేస్తున్నారు. భక్తులు సమర్పించిన బంగారం ప్రస్తుతం ఏడుకొండల వాడి వద్ద దాదాపు 9,259 కిలోల వరకూ ఉంది.