యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్రానికి వరదాయినిగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించడానికి వీలుగా.. గరిష్టంగా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం అధికారులను ఆదేశించారు. ఏడాదికి 540 నుంచి 600 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసి.. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే కేసీఆర్ స్వప్నం సాకారం కాబోతోంది. నీటిని లిఫ్ట్ చేయడానికి భారీగా విద్యుత్ అవసరమైనా.. ఏ మాత్రం వెనకడుగు వేయొద్దని ఆయన ఇప్పటికే అధికారులకు సూచించారు. జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన కేసీఆర్.. జూన్ 17న అమరావతి వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి పేచీలు పెట్టకుండా సహకరించినందున ఫడ్నవీస్‌ను, సాటి తెలుగు రాష్ట్ర సీఎం అయిన జగన్‌ను కేసీఆర్ చీఫ్ గెస్టులుగా పిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోణంలో చూస్తే.. ఏపీ సీఎం జగన్ ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణకు కేటాయించి చొరవ చూపారు. కేసీఆర్ కూడా సమస్యలను పరిష్కరించుకోవాలని, అనవసర రాద్దాంతాలేవీ వద్దనే భావనతో ఉన్నారు. కానీ ఏపీకి చెందిన కొందరు మాత్రం.. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. 2016లో కాళేశ్వం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వ్యతిరేకంగా జగన్ మూడు రోజులపాటు కర్నూలులో జలదీక్ష చేపట్టారని, 2019లో అదే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడాన్ని నిరసిస్తూ.. అదే ఏడాది మే 16, 17, 18 తేదీల్లో వైఎస్ జగన్ కర్నూలులో జలదీక్ష పేరిట మూడు రోజులపాటు నిరహార దీక్ష చేపట్టారు. ‘‘తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ, తెలంగాణ.. ఇండియా, పాకిస్థాన్ అయిపోదా? తాగడానికి నీళ్లు లేకపోతే బతికేదెలా? భుపాలపల్లి థర్మల్ ప్రాజెక్ట్‌తో కలిపి గోదావరి జలాల ట్రిబ్యూనల్ గతంలో ఏపీకి 1480 టీఎంసీలను కేటాయించింది. ఇందులో నా భాగం 954 టీఎంసీలు, మిగతా 530 టీఎంసీలు మీవని కేసీఆర్ అంటున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్‌ను.. ఎవడబ్బ సొత్తప్పా ఇది అని అడుగుతున్నా? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతున్నారు. వాటికి అనుగుణంగా లెక్కలు కడుతున్న కేసీఆర్ తీరు ధర్మమేనా? ఇరు రాష్ట్రాల నీటి వాటా ఎంత అనేది కృష్ణా, గోదావరి నదుల్లో తేలలేదు. కేవలం మీది ఎగువ రాష్ట్రం కాబట్టి.. మీ అవసరాలు తీరాకే మాకు నీళ్లు పంపిస్తామని హిట్లర్‌లా మాట్లాడటం కేసీఆర్‌కు భావ్యం కాదు. కేసీఆర్‌కు జ్ఞానోదయం కావాలి, చంద్రబాబు జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నా’’ అని జగన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది