యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుదేశాల అభిమానుల్లోనూ ఉద్వేగం ఓ రేంజ్‌లో ఉంటుంది. అదే వరల్డ్ కప్ మ్యాచ్ అయితే.. ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా దాయాది జట్లు తలపడబోతున్నాయి. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఊపు మీదున్న కోహ్లి సేన పాక్‌తో మ్యాచ్‌కు సై అంటోంది. వరల్డ్ కప్‌లో పాక్‌పై ఓటమి ఎరగని రికార్డును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్‌పై గెలిచి, ఆసీస్ చేతుల్లో ఓడిన పాక్.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. కానీ భారత్, పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. పిలవని చుట్టంలా వస్తోన్న వర్షం కారణంగా ఇప్పటికే వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు రద్దయిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లో దాయాదుల సమరాన్ని చూసి ఎంజాయ్ చేద్దామని భావించిన వారికి వర్షం పడుతుందనే వార్తలు నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి మాంచెస్టర్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం తర్వాతే సూర్యుడు కనిపిస్తాడని చెప్పింది. వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ సగం ముగిశాక కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఇది రాత్రి 7.30 గంటల వరకు కొనసాగే వీలుంది. కాబట్టి భారత్, పాక్ మ్యాచ్‌లో పూర్తి ఆట దాదాపు కష్టమేనట. సాధారణంగా బ్రిటన్లో జూన్ నెల పొడిగా ఉంటుంది. గత ఏడాది జూన్‌లో ఇక్కడ 2 మీ.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. కానీ గత 24 గంటల్లోనే ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలో 100 మి.మీ. వర్షపాతం నమోదైంది.