జూన్ మాసం వచ్చినా రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టడంలేదు. నైరుతి రుతుపవనాల కదలిక మందగించడంతోపాటు, అరేబియా సముద్రంలో తుపాను కూడా కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోంది. ఇవాళ కూడా అదే రీతిలో భానుడి ప్రతాపం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 45.27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ జిల్లా బోయిల కింటాడలో 45.25, విజయనగరంలో 45.19, తూర్పుగోదావరి జిల్లా చామవరం, తుని ప్రాంతాల్లో 45.18, శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో 44.90 డిగ్రీల వేడిమి నమోదైంది.అంతేగాకుండా, రాష్ట్రంలోని మరో 31 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 172 ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు గుర్తించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని ఆర్టీజీఎస్ పేర్కొంది. వాతావరణంలో తేమశాతం కనిష్టస్థాయికి పడిపోయిందని, తద్వారా వడగాడ్పుల తీవ్రత కూడా మరికొన్నిరోజులు ఉండొచ్చని ఆర్టీజీఎస్ అధికారులు వివరించారు.