ఏపీ మాజీ స్పీకర్, రాజకీయ దురంధరుడు కోడెల శివప్రసాదరావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయన కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు కోడెల శివరామకృష్ణలపై ఇప్పటికే గుంటూరులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిజానికి మూడు దశాబ్దాలకు పైగా కోడెల కుటుంబం రాజకీయాల్లో ఉంది. అనేక పదవులు కూడా అనుభవించారు. నరసరావు పేట కేంద్రంగా కోడెల చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుంచి గెలిచి, స్పీకర్‌పదవిని అందుకున్నారు.ఇక, ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. అయితే, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కుటుంబంలోని కూతురు, కొడుకు రెచ్చిపోయారని అప్పట్లోనే పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి అప్పట్లో నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడం, కోడెల రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉండడంలో కేసులు నమోదు చేసేందుకు కూడా పోలీసులు జంకారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది.అవినీతి కూకటి వేళ్లతో పెకలిస్తానంటూ.. సీఎంగా ప్రమాణం చేసిన రోజునే వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంతో ఆయనపై ఉన్న భరోసాతో ఇప్పుడు కోడెల కుటుంబం అరాచకాలకు బలైపోయిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అపార్ట్‌మెంట్ బిల్డర్ల నుంచి భారీ ఎత్తున కోడెల కుమారుడు కమీషన్లు గుంజుకున్నాడని, దీంతో పనులు కూడా ఆపుకున్నామని, కొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మొన్నటి వరకు కేసులు పెట్టేందుకు, ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే ఇక, తాము కొనుగోలు చేసిన పొలాలు తమవంతూ.. కోడెల కుమార్తె భారీ ఎత్తున తమ నుంచి డబ్బులు వసూలు చేశారని మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోడెల కుటుంబంపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి కుమారుడు, కూతురు చేస్తున్న ఆగడాలు కోడెల ఎప్పుడో పసి గట్టారు. ఆయనకు వ్యతిరేకంగా వివిధ పక్షాల నాయకులు గుంటూరులో ధర్నాలకు దిగినప్పుడే ఆయనకుఅసలు విషయం తెలిసింది. దీంతో ఆయన వీరిద్దరినీ హెచ్చరించారు కూడా. అయినా కూడా ఈ ఇద్దరూ ఆయన మాటలను పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు కేసుల ఉచ్చుతో కోడెల ఫ్యామిలీ అల్లాడుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులు ఎటు దారి తీస్తాయో చూడాలి.