తమ్మినేని సీతారాం ఏపీకి కొత్త స్పీకర్. ఆయన రాజకీయ జీవితం చాలా సుదీర్ఘమైనది. 1983లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి సభలో చంద్రబాబు కూడా లేరు, అలాగే, ఇపుడున్న 15వ సభలో దాదాపుగా ఎవరూ లేరనే అనుకోవాలేమో. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రిగా పోటీ చేసి ఓడిపోయిన బాబు 1989 వరకూ మళ్ళీ శాసనసభకు రాలేదు. ఈలోగా మూడు సార్లు తమ్మినేని ఎమ్మెల్యే గిరీలో ఉంటూ హ్యాట్రిక్ విజయం సాధించారు. అదే విధంగా 1994, 1999లో కూడా గెలిచి ఏకంగా 21 ఏళ్ళ పాటు నిరంతరంగా ప్రజాప్రతినిధిగా ఓటమెరుగని వీరుడుగా ఉన్న ఘనత తమ్మినేనిదే. 2004 నుంచి 15 ఏళ్ళ పాటు మూడు ఎన్నికల్లో తమ్మినేని పరాభవం చవిచూశారు. ఓ విధంగా తమ్మినేని పని అయిపోయిందని అంతా అనుకుంటున్న వేళ మళ్ళీ పైకి లేచి తాజా ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. నవ్యాంధ్రకు రెండవ స్పీకర్ గా ఏకగ్రీవంగా గెలిచి నిలిచారు.తమ్మినేని సీతారాం అన్న నందమూరికి వీర విధెయునిగా ఉండేవారు. కాళింగ సామాజికవర్గానికి చెందిన ఆయన నవ యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీకి వెన్నెముకగా ఉండేవారు. శ్రీకాకుళం జిల్లాలో దివంగత ఎర్రన్నాయుడు కుటుంబాన్ని ఎదిరించి నిలబడడమే కాదు, మరో వైపు రాజకీయ కుటుంబం కళా వెంకటరావుతోనూ ఢీ కొట్టారు. ఒకేసారి అందరితో పెట్టుకున్నా కూడా జనబలంతో ఆయన నెగ్గుకువచ్చారు. చివరికి చంద్రబాబు వద్ద మిగిలిన నాయకుల మాట నెగ్గి తమ్మినేని ప్రాధ్యాన్యత అలా తగ్గిపోయింది. దాంతో తమ్మినేని ఒంటరిగా టీడీపీలో మిగిలారు. ఈ పరిణామాల్లో చంద్రబాబుతోనే సవాల్ చేసి మరీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.ఇక తమ్మినేని మలిదశ రాజకీయమంతా ఒడుదుడుకులతో కూడినదే కావడం విధి విచిత్రం. 2004, 2009, 2014లో ఇలా వరసగా మూడు ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు. అది కూడా మూడు వేరు వేరు పార్టీల ద్వారా పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం ఆ తరువాత వైసీపీ ఇలా మారినా చివరకి వైసీపీ నుంచే తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో గెలిచిన తమ్మినేని రాజ్యంగబద్ధమైన పదవిలో సంత్రుప్తిగా బాధ్యతలను స్వీకరించారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పిన తమ్మినేని అత్యున్నతమైన స్పీకర్ పదవిని అధిష్టించిన మీదట గర్వంగా రాజకీయాల నుంచి విరమించుకోవడానికి మార్గం ఏర్పరచుకున్నారంటే అది చాలా సముచితమని చెప్పాలి. ఏ విధంగా చూసినా తమ్మినేని సిక్కోలు పోరాటయోధుడుగా జనం గుండెల్లో గుర్తుంటారు.