YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఖరీఫ్ కు ముందే పెరిగిన ఎరువులు

ఖరీఫ్ కు ముందే పెరిగిన ఎరువులు

 ఖరీఫ్‌ సీజను ప్రారంభానికి ముందే ప్రభుత్వం మరోసారి ఎరువుల ధరలు పెంచటంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కో ఎరువు బస్తాపై రూ.100 నుంచి రూ.120 వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయం భారంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తోడు ఎరువుల ధరలకు రెక్కలు రావటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతులు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఉత్సాహం చూపని ప్రభుత్వాలు ఎరువుల ధరల పెరుగుదలకు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడుతున్నారు. మూడేళ్లుగా వ్యవసాయానికి సాగునీరు, వర్షాలు లేకపోవడంతో కరువు కాటకాలతో అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం ధరలు పెంచటం సరికాదంటున్నారు. రైతులకు నిరంతరం అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడతామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతన్నలను నిండాముంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీలు తదితర ఖర్చులకు తోడు ప్రకృతి కరుణించకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఖరీఫ్ సీజన్‌కు సన్నద్దమవుతున్న రైతులకు ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. కొండెక్కిన కాంప్లెక్స్ ఎరువుల ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 50 కిలోల బరువు  ఉండే ఒక్కక్క బస్తాకు రూ.90 నుంచి రూ.215 వరకు పెరిగింది. సీజన్ ప్రాంరంభం కావడంతో రైతులు తాము సాగు చేస్తున్న విస్తీర్ణాన్ని బట్టి ఒకే సారి కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు వస్తున్నా.. ధరలు పెరిగాయని దుకాణదారులు చెబుతుండటంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండెళ్లుగా కాంప్లెక్స్ ఎరువులపై కేంద్రం ధరల నియంత్రణ ఎత్తివేయడంతో ప్రముఖ కంపెనీలు రెండు సార్లు ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి.. ప్రతి సీజన్‌లో ఇందుకోసం సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతుంటాయి. వ్యవసాయ రంగ ప్రాధా న్యం ఉన్న ఈ జిల్లాలో ఎక్కువగా ఉపయోగించే డీఏపీ, పోటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరగడంతో జిల్లా రైతులపై కోట్లాది రూపాయల భారం పడనుంది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇటీవలే ఎకరాకు రూ.4వేలు పంపిణీ చేసినప్పటికీ ఎరువుల ధరలు పెరగడంతో ఆ సంతోషం మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది.ప్రభుత్వం కౌలు రైతులకు  ప్రొత్సాహం అందించకపోగా మరో పక్క ఎరువుల ధర పెంచి వారి నడ్డి విరుస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకొని బడా రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు వ్యవసాయంపై మక్కువ చూపలేని పరిస్థితి నెలకొంది. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు వస్తుండటం, భూ యజమానికి పండిన పంటలో సగ భాగం ఇవ్వడంతో తమకు మిగిలేది ఏమి లేదని వాపోతున్నారు. ప్రభుత్వం అందించే సాయం కౌలు రైతులకు సైతం అమలు చేస్తే వారిపై కూడా కొంతభారం తగ్గెదని పలురువు రైతులు పేర్కొంటున్నారు.ఖరీస్ సీజన్ ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎరువుల వ్యాపారులు పుట్టగోడుగుల్లా పుట్టుకోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచి వ్యాపారం సాగిస్తున్నారు. ఎరువుల కంపెనీలు పెంచిన ధరలతోనే ఇబ్బందులకు గురవుతుంటే గ్రామీణ వ్యాపారులు ప్రభుత్వ ధర కంటే అదనంగా బస్తాకు రూ.50 వరకు పెంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇది తెలిసిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. జిల్లాలో ఈ ఖరీప్ సీజన్‌కు గాను సుమారు 30వేల మెట్రిక్ టన్నుల యూరియా, 10వేల మెట్రిక్‌టన్నుల డీఏపీ, 2.5వేల మెట్రిక్‌టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 8వేల మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో వరి సాగు చేస్తే రెండు బస్తాల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువు అయితే 3 బస్తాలు, మిరెట్ ఆఫ్ పోటాష్ ఎరువు ఒక బస్తాను ఉపయోగిస్తారు. డీఏపీ ధర గత మార్చిలో రూ.1076 ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ.1290 అయ్యింది. అంటే డీఏపీ బస్తాపై రూ.214, కాంప్లెక్స్ బస్తా ధర రూ.90, పోటాష్ బస్తా ధర రూ.90గా పెరిగింది. ఈ లెక్కన ఒక్కొక్క రైతుపై సుమారు రూ.520 వరకు భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో జిల్లా రైతులపై సుమారు రూ.5కోట్ల వరకు భారం పడనున్నట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Related Posts