యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సర్కారు దవాఖానలకు నిధుల కేటాయింపు విధానంలో మార్పుల దిశగా వైద్యారోగ్యశాఖ కసరత్తు మొదలుపెట్టింది. బెడ్ల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించే పద్ధతికి స్వస్తి పలికి, ఆస్పత్రికి వచ్చే రోగులు, చికిత్సకు అవసరమయ్యే ఖర్చును లెక్కించి ప్రతి నెల నిధులు విడుదల చేయాలని భావిస్తోంది.రాష్ర్టంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా అన్ని దవాఖాన్లకు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో అనధికారికంగా బెడ్లు వేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో అధికారికంగా వెయ్యి బెడ్లు ఉంటే, అనధికారికంగా మరో వెయ్యి బెడ్ల వరకూ వేసి చికిత్స చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోవడంలేదు. శస్ర్త చికిత్సల సందర్భంలో అవసరమైన పరికరాలను రోగులే బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో రోగ నిర్ధారణ పరీక్షలకు కూడా పేషెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిధుల కేటాయింపుకు కొత్త విధానం తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ప్రస్తుతం ఏ ఆస్పత్రికి ఎన్ని నిధులు అవసరమవుతాయో లెక్కించడానికి ఓ పద్ధతి లేదు. దీంతో కొత్త విధానం ప్రామాణికంగా, శాస్ర్తీయంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రోగికి కూడా తెలిసేలా కొత్త పద్ధతిని రూపొందించారు. ‘పేషెంట్–ట్రీట్‌మెంట్’ కేటాయింపు విధానంలో భాగంగా దవాఖానకు రోగి రాగానే ప్రైవేటు తరహాలోనే ప్రత్యేక నంబర్‌తో ఓపీ ఇస్తారు. ఖర్చు ఎంతైనా సరే ఉచితంగానే చికిత్స చేస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని జబ్బులకు కూడా చికిత్స అందిస్తారు. కానీ చివర్లో బిల్లు ఎంతైందో పేషెంట్‌కు లెక్క చెప్తారు. ‘నీకోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేసింది’అంటూ వివరిస్తారు. అదే బిల్లును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు. ఇలా పక్కా లెక్కల ఆధారంగా ప్రతి నెల చివర్లో దవాఖాన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు.