యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ సర్కార్ తో సఖ్యత గా వుంటూ ఎపి ప్రయోజనాలు హక్కులు కాపాడుకోవాలని చూస్తున్నారు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దానికి టి సిఎం కూడా అంతే సానుకూలంగా స్నేహ హస్తం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి కి రాత్రి చంద్రబాబు అమరావతి మకాం మార్చేయడంతో ఎపి భవనాలు నిరుపయోగంగా వుండి పోయాయి. వాటికి విద్యుత్ బకాయిలు, పన్నులు పేరుకుపోవడంతో టి సర్కార్ కోరిక మేరకు మరో ఐదేళ్లు ఎపి హయాంలో వుండాలిసిన భవనాలను వారికి ఇచ్చేందుకు అంగీకరించి మరింత సుహృద్భావ వాతావరణానికి తెలుగు రాష్ట్రాలు మసిలేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చర్యలు చేపట్టారు కూడా. గవర్నర్ ఆమోదంతో బదలాయింపు ప్రక్రియ పూర్తి అయిపొయింది. ఈ వ్యవహారంతో ఎంతోకాలంగా ఇరు రాష్ట్రాల నడుమ వున్న ఆస్తి వివాదాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చల ప్రక్రియకు ఆస్కారం లభించింది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను కెసిఆర్ సర్కార్ వచ్చి రీ డిజైన్ చేసింది. దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా పేరును సైతం మార్చింది. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, ఎపి సిఎం వైఎస్ జగన్ ను ముఖ్య అతిధులుగా కెసిఆర్ ఆహ్వానిస్తున్నారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఎపి సిఎం హాజరయితే వైఎస్ రూపొందించిన ప్రాణహిత ప్రాజెక్ట్ తప్పు అన్నది చెప్పక చెప్పినట్లు అవుతుందని టి కాంగ్రెస్ వాదిస్తుంది. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా వైఎస్ చేశారన్న గులాబీ బాస్ గత విమర్శలను టి కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. అదీ గాక కృష్ణ – గోదావరి జలాలపై ఎపి హక్కులను టి సర్కార్ హరిస్తుందంటూ గతంలో మూడు రోజులు జగన్ చేసిన దీక్షలను ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ఎపి సిఎం హాజరయితే గతంలో వారు చేసిన వాటికి అర్ధం ఏమిటన్నది చెప్పాలని సూటిగా నిలదీస్తుంది.అయితే ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి హాజరు అవుతారన్నది వైసిపి వర్గాల సమాచారం. ఏపీకి లైఫ్ లైన్ వంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కిరి కిరిలు చేయకుండా తెలంగాణ తో వ్యవహారం నడపాలని అలాగే కృష్ణా జలాల వాటా ల అంశంలోనూ టి సిఎం తో సఖ్యత అవసరమని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు సంక్లిష్టమైన విభజన ముళ్ళు విప్పాలంటే కేంద్ర సహకారం ఎలా వున్నా ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయాలన్నది ఫ్యాన్ పార్టీ ఆలోచన. జగన్ అందువల్లే తొలినుంచి ఈ విషయంలో తెలంగాణ తో సఖ్యతని కోరుకుంటున్నట్లు విశ్లేషకుల అంచనా. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం లో జగన్ పాల్గొన్నాకా దీనిపై టిడిపి వర్గాలు ఎపి ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ వైసిపి పై దాడికి విమర్శల దాడి మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి జగన్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.