యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర పడిపోయింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,720కు క్షీణించింది. బలమైన అంతర్జాతీయ ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయంగా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.300 తగ్గుదలతో రూ.38,100కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,345.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.34 శాతం తగ్గుదలతో 14.84 డాలర్లకు క్షీణించింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,550కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.26,800కు చేరింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గుదలతో రూ.38,100కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.640 తగ్గుదలతో రూ.36,800కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇకపోతే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,050కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,480కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.40,100కు దిగొచ్చింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.