YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బలహీనపడిన ‘వాయు’.. రుతుపవనాల కదలిక

బలహీనపడిన ‘వాయు’.. రుతుపవనాల కదలిక

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

నైరుతి రుతుపవనాల మందగమనంతో దేశవ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశమంతా విస్తరించి వర్షాలు కురవాల్సి ఉంది. కానీ గతవారం అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను ప్రభావంతో రుతుపవనాలు మందకొడిగా కొనసాగుతున్నాయి. 18, 20 తేదీలకల్లా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల మందగమనం వల్ల దేశవ్యాప్తంగా 43శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో 59 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, తూర్పు, ఈశాన్య భారతాల్లో 47శాతం నమోదైంది. గుజరాత్‌లోని విదర్భప్రాంతంలో అత్యంత దారుణంగా 87 శాతం వర్షపాతం లోటు నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాలూ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అనేక జలాశయాల్లో నీటి నిల్వలు పదేళ్ల కంటే తక్కువ స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో నీటి కోసం కటకటలాడుతోంది. చెన్నై తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుంటారు. ఈ జలాశయంలో 6.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెన్నైకి నీటిని విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుత నీటిమట్ట్ 4.58 టీఎంసీలకు పడిపోవడంతో నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో చెన్నై నగరంలో నీటి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. వర్షాలు కురవడం ఇంకా ఆలస్యమైతే పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉన్నా కేరళ, కర్ణాటక రాష్ట్రాలు దాటలేదు. వాటి ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ద్వీపకల్పం మీదుగా మంగళూరు, మైసూరు, కడలూరు వద్దే నిలిచిపోయిన రుతుపవనాలు వాయు తుపాను బలహీనపడటంతో క్రమంగా యాక్టివ్‌గా మారుతున్నాయి. దీంతో మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు కొద్దరోజుల్లోనే అవి విస్తరిస్తాయని ఐఎండీ చెబుతోంది. వాయు తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కరుస్తున్నాయి. తుఫాను సోమవారం సాయంత్రం తీరం దాటిన తర్వాత రుతుపవనాలు అరేబియా సముద్రం వైపు పయనిస్తాయని, రెండు మూడు రోజుల్లో వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారత ప్రాంతాలకు విస్తరిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Related Posts