యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 491 పాయింట్ల నష్టంతో 38,961 పాయింట్ల వద్ద ముగసింది. ఇక నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11,672 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
పతనానికి కారణాలు
✺ అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
✺ ఫెడ్ సమావేశం (జూన్ 18-19) నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
✺ విదేశీ సంప్థాగత ఇన్వెస్ట్‌మెంట్లు నెమ్మదించాయి. జూన్ 3న (నిఫ్టీ రికార్డ్ స్థాయికి చేరినపుడు) ఎఫ్ఐఐ ఇన్వెస్ట్‌మెంట్లు రూ.3,000 కోట్లుగా ఉన్నాయి. అయితే తర్వాతి నుంచి పెట్టుబడులు నెమ్మదించాయి.
✺ నిఫ్టీ కీలకమైన 20 రోజుల ఎక్స్‌పొన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయి 11,828 పాయింట్లని కోల్పోయింది. దీంతో సూచీ కిందకు పడిపోయింది.
✺ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 50 రోజుల మూవింగ్ యావరేజ్ దిశగా కదులుతోంది. ఇంట్రాడేలో సూచీ ఏకంగా 1 శాతం మేర పడిపోయింది. ✺ అధిక వ్యాల్యుయేషన్స్, బలహీన రుతుపవనాలు వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్ ఇండియా, విప్రో షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ దాదాపు 1 శాతం లాభపడింది.
✺ అదేసమయంలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్ దాదాపు 6 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పతనమైంది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్, ఆటో ఇండెక్స్‌లు కూడా ఎక్కువగానే పడిపోయాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.53 శాతం తగ్గుదలతో 61.69 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.59 శాతం తగ్గుదలతో 52.20 డాలర్లకు దిగొచ్చింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 13 పైసలు తగ్గుదలతో 69.93 వద్ద ఉంది.