యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనకు ఈరోజు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. సోమవారం వారితో బహిరంగ చర్చలకు అంగీకరించారు. మీడియా సమక్షంలో జరిగే ఈ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మమత ఓకే అన్నారు. ఈ చర్చల నిమిత్తం కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నాకు సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చేరుకున్నారు. మరికాసేపట్లో చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలకు మీడియాను అనుమతించే విషయంలో దీదీ యూటర్న్ తీసుకున్నారు. కేవలం ఒక్క స్థానిక మీడియా చానెల్‌ను మాత్రమే ఈ చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరిస్తామని ఆమె తేల్చిచెప్పారు. దీంతో ఉత్సాహంగా చర్చలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు.