పార్టీ మారుపై స్పందించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలకు వెళ్లిన జేసీ తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై పొగడ్తలు కురిపించిన దివాకర్ రెడ్డి.. బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో చేరాలంటూ తనకు ఆఫర్ వచ్చిందంటున్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కానీ తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పానని.. అలాంటప్పుడు పార్టీ ఎలా మారతానని ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటారని.. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించారని జేసీ ప్రశంసలు కురిపించారు. పులివెందుల నుంచి వచ్చిన నేత ఇలా ఉంటాడని అనుకోలేదన్నారు. తాను భయపడి జగన్‌పై పొగడ్తలు కురిపించడం లేదని.. సీఎం తీరు నచ్చి ప్రశంసిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను భయపడుతున్నానో లేదో ఆరు నెలల తర్వాత చూస్తారని మరో బాంబ్ పేల్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు జేసీ.. చంద్రబాబుకు ఇదే విషయాన్ని చెప్పారట. బీజేపీ తమతో టచ్‌లోకి వచ్చారని దివాకర్ రెడ్డి బాంబ్ పేల్చడంతో టీడీపీలోనూ చర్చ మొదలయ్యింది. జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈలోపే ఆయనే స్వయంగా ఆ పార్టీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.