ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతులకు పంపిణీచేయడానికి విత్తనాలు, ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో రైతులకు సబ్సిడీ విత్తన వేరుశెనగ పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా రైతులు వాపసు చేయాలన్నారు. రూ.2,840 రూపాయల సబ్సిడీపై రైతులకు వేరుశెనగ విత్తనకాయలు అందజేస్తున్నారు. కె-6 వేరుశెనగ విత్తనం క్వింటాలు ధర రూ.7,100 కాగా 40 శాతం రాయితీ 2,840 పోను మిగతా సొమ్ము రూ.4,260 రైతులు చెల్లించి క్వింటాలు విత్తనం పొందవచ్చు. జిల్లా వ్యాప్తంగా 98,470 క్వింటాళ్ల విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచారు. వరి, వేరుశనగ తదితర విత్తనాలు సరిపడేంతగా సిద్ధం చేశామన్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు
మందులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అవసరమైన మేరకు ఉచితంగా బోర్లు వేసి, సాగునీటి అవసరాలు తీర్చడానికి రైతులకు అందుబాటులో ఉండేవిధంగా నియోజకవర్గానికో మొబైల్ బోర్ రిగ్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి చొప్పున కూడా మొబైల్ రిగ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతు భరోసా పథకాన్ని రెండో ఏడాది నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులకు కూడా రుణాలందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. సహకార సంఘాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి గతంలో కేంద్రం అందించిన కరవు నిధులను సైతం గత టీడీపీ ప్రభుత్వం దారిమళ్ళించేసిందన్నారు. కేంద్రం రూ.932 కోట్ల నిధులు మంజూరు చేస్తే వాటిలో ఒక్క కోటి రూపాయలు కూడా కరవు నివారణకు వినియోగించలేదన్నారు. గత మూడు నెలలుగా ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి దాపురించిందని మంత్రి కన్నబాబు
దుయ్యబట్టారు.