రాష్ట్రం అగ్నిగుండంలా మండుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రికార్డులను తిరగరాస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో జనం విలవిల్లాడుతున్నారు. వేసవి ప్రభావం జూన్ మూడో వారంలోనూ కొనసాగడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినప్పటికీ, రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఊరిస్తున్నాయి. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందేనని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకువచ్చేందుకు సైతం భయపడే పరిస్థితులున్నాయి.సాధారణంగా జూన్ ప్రారంభంలోనే కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కేరళను తాకిన రుతుపవనాలు కేవలం రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ, అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. నైరుతి పవనాలు ఈ ఏడాది జూన్ రెండో వారం చివరి వరకూ కేరళను పూర్తిగా వ్యాపించలేదు. దీంతో రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని వాతావరణ నిపుణులు అంటున్నారు. సాధారణంగా మే నుంచి జూన్ నెలలో భూమధ్య రేఖ వెంబడి దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వచ్చే గాలులు నైరుతి రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తాయని, వాతావరణ శాఖ నిపుణులు వైకే రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది భూమధ్యరేఖ వెంబడి వచ్చే గాలులు బలహీనంగా ఉండటంతో నైరుతి రుతుపవనాల గమనాన్ని మందగించేలా చేశాయని తెలిపారు. దీనికి తోడు అరేబియా సముద్రంలో
ఇటీవల సంభవించిన ‘వాయు’ తుపాను కూడా నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని తెలిపారు. వాయు తుపాను ప్రభావంతో రుతుపవనాల ఆలస్యం కూడా వేసవి కొనసాగింపునకు కారణంగా పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తాను పలుకరించే అవకాశం ఉందని, ఈనెల 21 తరువాత విశాఖతో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజానీకం తల్లడిల్లుతోంది. గాలిలో తేమశాతం పూర్తిగా పడిపోతున్న కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో 5 నుంచి 6 డిగ్రీల మేర సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వివిధ నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తుని 44.4 డిగ్రీలు, విశాఖపట్నం 43.6 డిగ్రీలు, మచిలీపట్నం, ఒంగోలు 43.2డిగ్రీలు, బాపట్ల, కావలి 42.8 డిగ్రీలు, నెల్లూరు 42.5 డిగ్రీలు, గన్నవరం 42.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు.