యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీఎంగా జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. పాలనా పగ్గాలు చేపట్టి..కేవలం 15 రోజులే అయినా.. రాష్ట్రంలో వినూత్న చర్యల దిశగా జగన్ చేపట్టిన కార్యక్రమాలు అనూహ్యం. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలో ఒక అజెండాతోను, కేంద్రంలో మరో అజెండాతోను ముందుకు సాగారు. ఫలితంగా రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉత్తమ సీఎంగా, మంచి సీఎంగా గుర్తింపు సాధించే క్రమంలో ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు కూడా ఆశాజనకంగానే ఉండడం గమనార్హం. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో గతంలో చంద్రబాబు వినిపించిన వాదనకు భిన్నంగా జగన్ వ్యవహరించారు.రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉంది? ఏ విధమైన అప్పులు ఉన్నాయి? వాటికి అవుతున్న వడ్డీలు ఎంత? అనే కీలక విషయాలను ఆయన వెల్లడించారు. అది కూడా తాను ఆదిలోనే చెప్పినట్టు సార్.. ప్లీజ్! అంటూ ప్రధాని నరేంద్ర మోడీ హృదయాన్ని కరిగించే చర్యలు చేపట్టారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్ ఆడిటోరియంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన ప్లీజ్.. ప్లీజ్ అంటూనే ఏపీ సమస్యలను, ఏపీకి హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఏకరువు పెట్టారు. నరేంద్ర మోడీని సాధ్యమైనంత వరకు సానుకూలం చేసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారు.‘‘రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఉన్న రూ. 97 వేల కోట్ల అప్పులు ఈ ఐదేళ్లలో అంటే, 2018-19 నాటికి రూ. 2,58,928 కోట్లకు చేరాయి. ఈ అప్పులకు ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. ఇది కాకుండా అసలు మరో రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రానికి చెందిన యువత ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని విడిచిపెడుతున్నారు. ఉపాధి కల్పించే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది’’ అని జగన్ వివరించారు.గత రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పరిపాలించక, వ్యవస్థీకృత అవినీతి, చిత్తశుద్ధిలేమి వల్ల కూడా నిరుద్యోగం మరింత పెరిగిందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోరని వదంతులు వచ్చాయి. వాటి గురించి విన్నప్పుడు బాధగా ఉంటుంది. అయితే, ప్రత్యేక హోదా వ్యవస్థను రద్దు చేయాలని తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ స్పష్టంగా చెప్పారు అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. హోదా రద్దుకు సిఫారసు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు అభిజిత్ సేన్ ఈ-మెయిల్ ద్వారా రాసిన ప్రతిని తన ప్రసంగ పత్రానికి ఆయన జతపరిచారు.అలాగే, 2014 మార్చి 2న సమావేశమైన అప్పటి యూపీఏ కేంద్ర మంత్రివర్గం కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్యలను వేగవంతం చేయాలని ప్రణాళిక సంఘానికి సిఫారసు చేసిందని, అంటే ఈ హామీని అమలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించినట్టేనని తెలిపారు. అప్పటి కేబినెట్ నోట్‌ను కూడా జగన్ ప్రసంగ పత్రానికి జతపరిచారు. ఇలా మొత్తానికి ఒక విధానపరమైన మార్పుతో ఏపీకి రావాల్సిన హోదాపై జగన్ తగిన విధంగా తొలి అడుగు వేశారని అంటున్నారు మేధావులు. మరి ఈ విషయంలో మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.