యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి.. పట్టుమని పదిహేను రోజులు కూడా గడవక ముందుగానే.. ఆయన కేబినెట్‌లోని మంత్రుల్లో కొందరు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక, కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఎదురు చూసి, చివరి నిముషంలో రాని వారు ఆదిలో బాధపడినా.. ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉన్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయాలే! అయినా కూడా వీటికి ప్రాధాన్యం ఉంది. వాస్తవానికి ఏ నాయకుడైనా.. ముందు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అని అనిపించుకునేందుకు ఉబలాట పడతాడు. ఇదే.. వైసీపీలోనూ కొనసాగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం మాదిరిగా.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేబినెట్‌లో సీటు కోసం నాయకులు ప్రయత్నాలు చేశారు.ఇలా ప్రయత్నించిన వారిలో కొందరికి పదవులు దక్కాయి. మరికొందరికి అనూహ్యంగా పదవులు వరించాయి. ఇంకొందరి కి మాత్రం లభించలేదు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు సహా మొత్తం 25 మంది కేబినెట్.. ఆదిలో బాగానే ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. కేబినెట్ మంత్రుల్లో అసంతృప్తి ప్రారంభమైంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సహజంగానే జగన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలోనే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని హెచ్చరించారు. దీనిని ఇప్పుడు అమలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక క్రమశిక్షణ, మంత్రులకు మరో క్రమశిక్షణ అంటూ ఆయన ప్రత్యేకంగా ఓ విభజన రేఖను సృష్టించారని తెలుస్తోంది.దీనిలో భాగంగా ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువగానే ప్రభుత్వం నుంచి సౌకర్యాలు లభించే మంత్రులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ అంతర్గతంగానే కాకుండా కేబినెట్ మీటింగ్‌లోనూ వెల్లడించారని సమాచారం. అంటే.. విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్మును వినియోగించడంపై తొలి అంకంలోనే తాళం బిగించారు. ఇక, అర్హతకు మించి సెక్యూరిటీ కింద పోలీసుల వినియోగాన్ని ఆదిలోనే నిషేధించారు. ఇప్పుడు అందరూ దాదాపు కొత్త వారే ఉన్న నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యలు లేవు. కాబట్టి పోలీసులను ఎక్కువభాగం ప్రజల సమస్యలపైనే దృష్టిపెట్టేలా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు. ఖర్చులు తగ్గించడంతోపాటు అవినీతి అనేది లేకుండా పనిచేయాలని ఆయన ఆదేశించారు.ఈ పరిణామాన్ని కేబినెట్‌లోని జూనియర్ మంత్రులు జీర్ణించుకుంటున్నారు. కానీ సీనియర్ మంత్రులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం ఎక్కడెక్కడో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని తాము ఖర్చు చేశామని, ఇప్పుడు అన్ని వైపులా తలుపులు మూసేస్తే.. ఎలా? అని వారు అంతర్గత చర్చలలో బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. ఈ విషయంపై జూనియర్లు మౌనంగా ఉన్నారు. ఇక, దాదాపు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలానే ఉంది.