పెట్రోల్ బంకులతో పాటు వినియోగదారులు ఇకపై సూపర్ మార్కెట్లలో కూడా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే సదుపాయం అమలు కానుంది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియ, సహజవాయువు మంత్రిత్వశాఖ త్వరలోనే ఓ ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే సూపర్ మార్కెట్లు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లో ఇంధనం అమ్మకాలు సాగించేలా అనుమతి లభించనుంది.మరోవైపు రిటైల్ ఇంధన రంగంలో ప్రవేశించే ప్రయివేటు కంపెనీలకు అవసరమైన కనీస వసతులను కూడా సడలించనున్నారు. కనీస మౌలిక వసతుల కోసం దేశవాళీ మార్కెట్లో కనీసం 2 వేల కోట్ల పెట్టుబడులు 30 లక్షల టన్నుల క్రూడాయిల్‌కు బ్యాంకు గ్యారెంటీలు తదితర నిబంధనలు సడలించనున్నారు. దీంతో ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌తో పాటు అంతర్జాతీయ కంపెనీ సౌదీ అరామ్‌కో తదితర బహుళజాతి కంపెనీలు భారత రిటైల్ ఇంధన రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.