డబ్బు చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలీదు. ఉన్నోడు బికారి కావొచ్చు. లేనోడు కోటీశ్వరుడిగా మారొచ్చు. డబ్బు ఎప్పుడు ఎలా పోతుందో చెప్పలేం. ఇది కొంత సమయంలోనే మన వద్ద నుంచి వేరొకరి వద్దకు వెళ్లొచ్చు. ఇలాంటి ఘటనే ఒకటి ఈ రోజు చోటుచేసుకుంది.రుణ ఊబిలో చిక్కుకొని సతమతమౌతున్న జెట్ ఎయిర్వేస్ షేరరు మంగళవారం ఇంట్రాడేలో ఏకంగా 54 శాతం మేర పతనమైంది. ఎన్ఎస్ఈలో షేరు ధర ఒకానొక సమయంలో రూ.31.65 స్థాయికి పడిపోయింది. క్లోజింగ్కు వచ్చేసరికి షేరు ధర 41 శాతం క్షీణతతో రూ.40.50 వద్ద ముగిసింది.ఇన్వెస్టర్ల సంపద మంగళవారం కేవలం కొన్ని గంటల్లోనే రూ.316.37 కోట్ల మేర హరించుకుపోయింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.459 కోట్లకు పడిపోయింది. సోమవారం మార్కెట్ క్యాప్ రూ.776 కోట్లుగా ఉండటం గమనార్హం.
జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ కోసం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎన్సీఎల్టీకి వెళ్లడం షేరు ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దివాలా ప్రక్రియ ఈ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశముంది. ఎన్సీఎల్టీ జూన్ 20 దివాలా పిటిషన్ను విచారించనుంది.