ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని ఆళ్ల వ్యాఖ్యానించారు. ఉండవల్లిలో కృష్ణా నదీ తీరం వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించేలా పోరాటం చేస్తామని ఆళ్ల స్పష్టం చేశారు. టీడీపీ అధినేత తన ఇంటిని ఖాళీ చేసే వరకూ వదలిపెట్టబోమని చెప్పారు. మంగళవారం (జూన్ 18) అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు లేని చంద్రబాబు.. అమరావతిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఆళ్ల ఎద్దేవా చేశారు. తమ నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత్ వైఎస్ జగన్ తాడేపల్లిలో స్థలం కొనుక్కున్న తర్వాతే ఇల్లు కట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. రాజధానిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.సీఆర్డీఏ పరిధిలో పనులు ఎందుకు ఆపేశారని కాంట్రాక్టర్లను ఉద్దేశించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు ఏవైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరిమితికి మించిన టెండర్లు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.సీఎం జగన్ తనకు నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. దానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సీఆర్డీఏ ఛైర్మన్గా ముఖ్యమంత్రే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీఆర్డీఏ ఛైర్మన్ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇవ్వనున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.