యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న అధికార టీడీపీ అతి చిన్న పార్టీ స్థాయికి దిగజారి పోయింది. అంతేకాదు, గౌరవప్రదమైన స్ధానాలను కూడా పొందలేక చతికిల పడింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. నిజానికి రాజకీయాల్లో అధికారం ఇవాళ ఉంటుంది.. రేపు పోతుంది.. అనే మాటలు తరచుగా వినిపిస్తాయి. అయితే, వీటికి అతీతం గా తమ పాలన ఉందని, కనీసం 20 సంవత్సరాల పాటు తాము అధికారంలోనే ఉంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికలకు ముందు ఎవరూ ఊహించని విధంగా పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాల స్థాయిని పెంచారు. అన్న క్యాంటీన్లను పెట్టారు. నిరుద్యోగ భృతి కల్పించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి పాలవడానికి ఉన్న కారణాల్లో ముఖ్యమైనది.. అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎంతో ఉత్కంఠతో, ఆశతో ఎదురు చూసిన ప్రత్యేక హోదా విషయం కానీ, హైదరాబాద్ రాజధానిగా పదేళ్లపాటు సాగించాల్సిన పాలన విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన యూటర్న్ తీసుకుని మాట్లాడారు. ప్రత్యేక హోదా ఏపీకి జీవనాడి వంటిదని తెలిసిన ఆయన ఇదేమీ సంజీవని కాదంటూ.. చేసిన ప్రకటన నుంచి హోదా అంటే ఏంటో బ్రీఫ్ చేయండి.. అనడం వరకు ప్రజలు గమనించారు.అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించడాన్ని కూడా బాబు విషయంలో ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేనా అనుభవం అంటే? అని ప్రశ్నించుకున్నారు. ఇక, తన కుమారుడు లోకేష్‌ను దొడ్డిదారి గుండా మంత్రి ని చేయడాన్ని మెజారిటీ మేధావులు, ప్రజలు కూడా జీర్ణించుకోలేక పోయారు. లోకేష్‌కు ఇన్ని పదవులా? అని చర్చించుకున్నారు. అదేసమయంలో అధికారులను, అన్ని వ్యవస్తలను తనకు అనుకూలంగా మార్చుకుని, ప్రజలను కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.సంతృప్తి..80%, 85% అంటూ లేనిపోని లెక్కలు చెప్పడాన్ని ప్రజలు పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో ప్రతి ప్రభుత్వ పనికీ.. లంచాలు ఇవ్వాల్సి రావడం, రెవెన్యూ కార్యాలయాలు వసూళ్ల కేంద్రాలుగా, నిలువు దోపిడీ సంస్థలుగా మారిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకొన్నా.. అవి క్షేత్రస్థాయిలో కేవలం టీడీపీకి చెందిన వారికే అందడాన్ని ప్రజలు మరిచిపోలేక పోయారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీని అసలు పార్టీగా కూడా గుర్తించకపోవడం, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను 23మందిని చంద్రబాబు తన బ్యాచ్‌లో కలుపుకోవడం వంటివి భారీ మైనస్.ఇక, మరో కీలక విషయం.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని, జీతాలు ఇచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మని చెప్పిన చంద్రబాబు.. దర్పాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు, ధర్మ పోరాట దీక్షలు, ప్రతిజ్ఞల, పోలవరం సందర్శన, అమరావతి పర్యటనల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులపైకానీ, భూకబ్జాల్లో పేరు వినిపించిన బొండా వంటి ఎమ్మెల్యేలపై కానీ చర్యలు తీసుకోలేదు.ఒకప్పుడు టీడీపీలో పార్టీ అధినేతకు, కార్యకర్తలకు మధ్య చెక్కు చెదరని రిలేషన్ ఉండేది. ఈ సారి ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలకు, బాబుకు మధ్య బాగా దూరం పెంచేశారు. క్షేత్రస్థాయిలో తమను ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఎన్నికల్లో వీరు కూడా ఎమ్మెల్యేల ఓటమికి ప్రధాన కారకులుగా మారారు. దీంతో ప్రజలు విసుగెత్తి.. ఫార్టీ ఇయర్స్ అనుభవం మాకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిందంటే అందుకు సగం కారణం జన్మభూమి కమిటీలే అన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా ఓపెన్‌గానే చెపుతున్నారు. చాలా చోట్ల వీరు పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని విపక్ష పార్టీలకు చెందిన వారి నుంచి కమీషన్లు తీసుకుని వారికి పనులు చేసిపెట్టారు. ఇక, క్షత్రస్థాయిలో ఎమ్మెల్యేల ఆగడాలు.. వీటిని అరికట్టడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారు. నేల విడిచి సాము చేశారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో టీడీపీకి అండదండగా ఉన్న కార్యకర్తలను సైతం పార్టీ అధినేత పట్టించుకోలేదు. ఒకప్పుడు క్రమశిక్షణకు కేరాఫ్‌గా ఉన్న టీడీపీలో ఈ సారి చంద్రబాబు నాయుడును మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్క చేయని పరిస్థితి స్పష్టంగా కనపడింది. వెరసి ఇవన్నీ కూడా చంద్రబాబు మైనస్‌లుగా మారిపోయాయి. వీటిపై సమీక్షలు చేయడం మానేసిన చంద్రబాబు కారణాలు కనిపించడం లేదని ముక్తసరిగా ప్రకటించి మౌనం వహించడంపై టీడీపీ శ్రేణులేకలవరపడుతున్నాయి.మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కు కనిపించలేదంటే.. ఏమనాలి?!