యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక గ్లాస్‌హౌస్ సెంటర్లో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి. దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలార్పారు. మంటల తీవ్రత చేయిదాటిపోవడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.ప్రమాదానికి గురైన భవనం ఇరుకు వీధుల్లో ఉండడంతో అక్కడికి వెళ్లే వీలు లేకుండా అగ్ని మాపక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. భవనంలో ప్లాస్టిక్, స్కూల్ బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు.