యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లో జరగుతున్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, అకాలీదళ్ అధినేత సుక్ బీర్ సింగ్ బాదల్, పీడీపీ అధినేత్రి మెహబూబా మూర్తి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం ప్రధాన ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాందాస్ అథవాలే తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు.. ఆప్, టీడీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు డుమ్మా కొట్టాయి. అయితే జమిలి ఎన్నికల అంశం బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన విషయమని.. ఈ సమావేశానికి తాము హాజరుకాక పోవడమే మంచిదని విపక్షాలు నిర్ణయించాయి.
రాజ్యంగ విరుద్ధం : సీతారాం ఏచూరి
జమిలి ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య వ్యతిరేకమని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం సరికాదు అని ఏచూరి తెలిపారు. జమిలి ఎన్నికలను నిర్వహించడం వల్ల రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగబద్దంగా ప్రభుత్వ బాధ్యతలను విస్మరించినట్లు అవుతుందన్నారు. పదేపదే ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఉత్తమ విధానం అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. జమిలి ఎన్నికల విధానానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కానీ మోదీ మీటింగ్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలువురు సీఎంలు హాజరయ్యారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లు సమావేశానికి డుమ్మా కొట్టారు.ఏక కాలంలో ఎన్నికలతో పాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించారు.