యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నమ్మకం! రాజకీయాల్లో కీలకమైన అంశం. నాయకులు ప్రజలను, ప్రజలు నాయకులను నమ్మడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగున్న ప్రక్రియ. అయితే, అధికారాన్ని కోల్పోయిన టీడీపీ ఎవరిని నమ్మింది? ఎవరిని నమ్మలేదు? ఇప్పుడు ఈ ప్రశ్న.. ఆ పార్టీ నేతలను తొలిచేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో కనీసం గౌరవ ప్రదమైన స్థానాల్లో కూడా గెలుపును దక్కించుకోలేక పోయింది. కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు టీడీపీ హిస్టరీలోనే ఇది పెద్ద ఓటమిగా ఆపార్టీ నాయకులే చెబుతున్నారు.మరి ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటమిపై రోజుకో విధంగా విశ్లేషణలు సాగిస్తున్నారు. ఓడిన, గెలిచిన సీనియర్లను ఇంటికి పిలిపించుకుని మరీ జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మౌనంగానే ఉంటున్నా.. మరికొందరు సీనియర్లు మాత్రం జరిగిన విషయాలను ఏకరువు పెడుతున్నారు. దీనిలో కీలకమైంది.. నమ్మకం..! చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల కాలంలో తొలి రెండేళ్లు పార్టీ నుంచి వచ్చిన నాయకులను నమ్మారు. క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలు
రూపొందించారు. ఇవి సక్సెస్ అయ్యాయి. అయితే, ఆ తర్వాత మూడేళ్ల కాలంలో మాత్రం ఆయన వేసిన అడుగులు పార్టీని, నాయకులను కూడా దెబ్బతీశాయి.చంద్రబాబు నాయుడు తన చుట్టూ.. పార్టీతో సంబంధం లేని కొందరు మాజీ అధికారులను, మాజీ ఉద్యోగులను చేర్చుకున్నారు. వారికి నామినేటెడ్‌పదవులు ఇచ్చి.. అంతా మీరే చూసుకోండి.. మానాయకులకు ఏమీ తెలియదు! అన్నట్టుగా వారికి పగ్గాలు అప్పగించారు. దీంతో ఇలాంటి వారు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు తెచ్చుకునేందుకు, పార్టీ నాయకులను డమ్మీలను చేసేందుకు కూడా వెనుకాడలేదు. వీరిలో ఆర్థిక వేత్త్తలు, ఐ పీ ఎస్ మరియు ఐ ఏ ఎస్ అధికారుల వంటివారు కీలకమని ఇప్పుడు విశ్లేషణలను బట్టి నాయకులు బయటకు చెబుతున్నారు.తాము క్షేత్రస్థాయిలో
పరిస్థితిని వెల్లడించినా.. తమ మాటను సీఎం దాకా తీసుకు వెళ్లలేదని కొందరు వెల్లడించారు. ఈ పరిస్థితే.. ఓటమికి దారి తీసిందని వెల్లడించారు. అదేసమయంలో సంతృప్తి స్థాయి అంటూ.. చంద్రబాబు కళ్లకు కొందరు అధికారులు గంతలు కట్టారని కూడా విశ్లేషణలు వెల్లడించారు. మొత్తానికి ఎవరిని నమ్మాలో నమ్మకుండా.. ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మినందునే చంద్రబాబు నాయుడు కు వ్యతిరేక ఫలితం రావడానికి కారణమనే నిజం కొంత ఆలస్యంగానైనా గుర్తించారని అంటున్నారు తమ్ముళ్లు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారో చూడాలి.