యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి కలిసి వచ్చే నాయకుల్లో ఫస్ట్ వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. నిజానికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గడిచిన ఐదేళ్లకాలంలోనే కాకుండానే అంతకు ముందు కూడా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు బుగ్గన. కర్నూలు జిల్లా డోన్ నుంచి 2014లో విజయం సాధించిన ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అక్కడి నుంచి విజయం సాధించారు. ఈ రెండుసార్లు ఆయన కేఈ ఫ్యామిలీపైనే ఘనవిజయాలు సాధించారు.ఇక, వైసీపీలో ఆయన జగన్ మోహన్ రెడ్డి కి అన్నీతానై వ్యవహరించారు. ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో.. అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఆయన చక్కని పాత్ర పోషించారు.రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, దుబారా ఖర్చు, ప్రాజెక్టుల వ్యయం, సంక్షేమ పథకాల అమలు తీరు వంటివాటిని పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ సందర్భంగా బుగ్గనకు చక్కటి అవకాశం లభించింది. ఇక, ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బుగ్గనకు ఆర్థిక శాఖ పదవితో పాటు సభా వ్యవహారాల మంత్రిగా కూడా జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇచ్చారు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి చాలా
మేలు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన అన్నీతానై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా దగ్గర నుంచి చూసిన బుగ్గన ఇప్పుడు జగన్ ముందున్న నవరత్నాల వంటివాటిని అమలు చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఏ ప్రభుత్వానికైనా నిధుల సమస్య ప్రధానం. ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తాయి. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆదాయం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మద్యనిషేధం వంటిది ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు. అయినా కూడా బుగ్గన ఇచ్చిన ధైర్యంతో ఈ పథకాన్ని కూడా పట్టాలెక్కించేందుకు జగన్ ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇక, సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అడుగడుగునా కౌంటర్ ఇవ్వడంలోను, సభామర్యాదలు పాటించడంలోను కూడా బుగ్గన తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడా ఆర్బాటాలకు తావివ్వకుండా నిర్మాణాత్మకంగా ఆయన ప్రతిపక్షంపై చేస్తున్న దాడి, ప్రభుత్వాన్ని రక్షించుకుంటున్న తీరు వంటివి జగన్ మోహన్ రెడ్డి కి మరింతగా సహకరిస్తాయని అంటున్నారు పరిశీలకులు