ఏపీలో సార్వత్రిక ఎన్నికల తదనంతర పరిణామాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఓటమి భారంతో కుంగిపోతున్న టీడీపీలోని కీలక నేతలను చేరదీయడం ద్వారా తెలంగాణ తరహాలో సానుకూల ఫలితాలు రాబట్టడంతో పాటు భవిష్యత్తులో ఏపీలో పాగా వేయాలనేది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది.ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధిష్టానం వేగంగా పావులు కదిపేందుకు సిద్దమవుతోంది. కేంద్రంతో పాటు దేశంలోని దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్లో అదికారంలో ఉన్నప్పటికీ దక్షిణాదిన పాగా వేయలేకపోవడంపై తీవ్ర అంతర్మథనం సాగిస్తున్న బీజేపీ హైకమాండ్ దృష్టి ఇప్పుడు ఏపీపై పడింది. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది జగన్ ఆధ్వర్యంలోని
వైసీపీ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ .. రాబోయే రోజుల్లో ఏదో విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కేసీఆర్ తరహాలోనే టీడీపీని బలహీనపరిచే అవకాశాలుండటం, రెండోది ఐదేళ్లుగా సాగించిన అక్రమాల వ్యవహారాల్లో టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుండటం, దీంతో రాష్ట్రంలో టీడీపీకి చెందిన ప్రధాన నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.దీంతో రాష్ట్రంలో సీఎం జగన్ వ్యూహాలకు బాధితులుగా మిగిలే టీడీపీ నేతలంతా బీజేపీకి క్యూ కట్టే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం అసెంబ్లీలో 23గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య సగానికి కన్నా తక్కువకు పడిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఈ పరిస్ధితిని ముందుగానే ఊహిస్తున్న బీజేపీ... తగిన అవకాశం కోసం ముందస్తు వ్యూహలు రచిస్తోంది. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకునే అవకాశం ఉన్న టీడీపీ నేతలను సంప్రదించి వారిని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. అదే సమయంలో టీడీపీ తరఫున గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేతలు, అధికారులు ఇలా ఎవరినీ వదలకుండా తమ పార్టీలోకి ఆహ్వానించాలనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.. తద్వారా ఏపీలో వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది కాషాయ నేతల వ్యూహమని అర్థమవుతోంది.తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను నేరుగా భర్తీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన బీజేపీ... అన్నాడీఎంకేలో రాజకీయాలను ప్రోత్సహించి ఎన్డీయేలోకి మిత్రపక్షంగా చేర్చుకోగలిగింది. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ ప్రధాన నేతలకు వల వేయడం ద్వారా భవిష్యత్తులో టీడీపీలోనూ నాయకత్వ సమస్యను సృష్టించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం అయిన కేశినేని... ఆ తర్వాత టీడీపీ ఆఫర్ చేసిన లోక్ సభ విప్ పదవిని తీసుకునేందుకు సైతం నిరాకరించారు. అదే బాటలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జేసీ బ్రదర్స్, పల్లె రఘనాథరెడ్డి, వరదాపురం సూరితో పాటు పలువురి పేర్లు బీజేపీ ఆకర్ష్ జాబితాలో వినిపిస్తున్నాయి.గతంలో ఏపీలో కాంగ్రెస్, టీడీపీల్లో తనకున్న పరిచయాలతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరికొందరు సీనియర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు జనసేన నేత, మాజీ మంత్రి
రావెల కిషోర్ బాబును బీజేపీలోకి చేర్చుకున్న కాషాయ నేతలు.. త్వరలో మరికొందరికి కండువాలు కప్పడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పవని భావిస్తున్న టీడీపీ సీనియర్లు బీజేపీ వైపు చూస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొందరు కన్నాతో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ వైపు నేతలు వెళ్తారన్న ప్రచారాన్ని బహిరంగంగా ఖండిస్తున్న టీడీపీ సీనియర్లు... అంతర్గతంగా మాత్రం భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు అర్ధమవుతోంది.రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి సహకరిస్తూనే టీడీపీ నేతలకు ఆశ్రయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ... 2024 నాటికి పూర్తిస్ధాయిలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు వ్యూహరచన చేస్తోంది. అదే జరిగితే బెంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల తరహాలో టీడీపీ, కాంగ్రెస్ పరిస్ధితి మారినా ఆశ్చర్యం లేదు