వాస్తవాన్ని గ్రహించడం, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఏ వృత్తిలో, వ్యాపారంలో, రాజకీయంలో అయినా ఉండాల్సిన మొదటి లక్షణం. ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా ప్రవర్తిస్తే ఎప్పటికీ లక్ష్యం సాధించలేం. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సీట్ల పరంగా చూస్తే తీవ్రంగా దెబ్బతింది. అధికార వైసీపీ మాటకు ముందు వెనక ఇదే విషయాన్ని పదే పదే ఎద్దేవా చేస్తోంది. గత తప్పిదాల కారణంగా పీల స్వరం మాత్రమే ప్రతిపక్ష టీడీపీ వినిపించగలిగింది. కిందామీదాపడి 40 శాతం ఓట్లు తెచ్చుకున్నపార్టీ ఇంతటి దారుణమైన ఫలితాలు చవిచూడటానికి అనేక కారణాలు ఉన్నాయి.పరిపాలన లోపాలు, ముఖ్యమంత్రి కేంద్రంగానే పాలన కేంద్రీకృతం కావడం, ఆలోచనకు, ఆచరణకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం, ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోవడం, అవినీతి… తెలుగుదేశం పార్టీ పరాజయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. కానీ కులం అన్నిటి కంటే ముఖ్యమైన పాత్ర పోషించిందనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగిలిన కులాలు జట్టు కట్టడంతో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని సామాజిక రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాల్లో ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించడం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ విమర్శ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. తప్పులెక్కడ జరిగాయో తెలుసుకుని దిద్దుబాటు చర్యలకు పూనుకుంటే భవిష్యత్తులో అధికారపార్టీని ఎదుర్కొనే సామర్ధ్యం వస్తుంది. ప్రజాపోరాటాలు చేయగలుగుతారు. తమ బలహీనత, లోపం తెలియకపోతే మళ్లీ బోర్లాపడాల్సి వస్తుంది. తాము చేసిందే సరైనది అనుకుంటే మళ్లీ ప్రజాక్షేత్రంలో పరాజయం ఎదురుకావచ్చని రాజకీయవేత్తలు పేర్కొంటున్నారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు కావడంతో బయట ఏం జరుగుతుందో తెలియనంత దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సైకో ఫాన్సీ అభిమానంతో చంద్రబాబు ఆర్మీ వంటి పేర్లతో ప్రచార పటాటోపం పెరిగిపోయింది. ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాల అమలు, వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోలేనంత భయంకరమైన విష వలయం అధినేతను నిరంతరం తప్పుదారి పట్టించింది. మీడియా పరంగా వ్యతిరేక వార్తలు రాకుండా కొన్నిసంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి. దీంతో అంతా బాగా ఉందనే భ్రమకు లోనయ్యారు చంద్రబాబు నాయుడు. ఎన్టీయార్, వై.ఎస్ రాజశేఖరరెడ్డిలు అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రులు. అయినప్పటికీ వారెప్పుడూ తమ పేర్లతో స్కీములను ప్రవేశపెట్టుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కోటరీ సలహాలతో వివిధ పథకాలను చంద్రన్న స్కీములుగా మార్చేసుకున్నారు. ఇది తనకు శాశ్వతమైన కీర్తి తెచ్చిపెడుతుందని ఆయన భావించారు. కానీ మాయావతి సొంత విగ్రహాలు పెట్టుకుని దెబ్బతిన్న విధంగానే చంద్రబాబు నాయుడు సైతం స్వీయ తప్పిదాలతో ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. కళ్లు, చెవులు గా ఉపయోగపడాల్సిన మీడియా చంద్రబాబు నాయుడు కళ్లకు గంతలు కట్టేసింది. ఇక ఫీల్డు లెవెల్ లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లి పార్టీకి ఆదరణ పెంచాల్సిన కార్యకర్తలు పూర్తి నిర్లక్ష్యం వహించారు. జన్మభూమి కమిటీల వంటి వాటి ద్వారా ప్రభుత్వ పథకాలపై గెద్దల్లా వాలిపోయారనే విమర్శలూ ఉన్నాయి. ఆయా లోపాలను చంద్రబాబు నాయుడు ఇంకా కనిపెట్లలేకపోతున్నారని రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి.అందరూ అందరే…ఒకవైపు మీడియా, కార్యకర్తలు, సైకో ఫ్యాన్సీ దళాలు టీడీపీ అధినేతను దెబ్బతీశాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం సైతం చంద్రబాబు నాయుడు ను తప్పుదారి పట్టించడమే విచిత్రం. ప్రపంచంలో ఏ ప్రభుత్వంపైనా ఉండనంత సంత్రుప్త స్థాయిని ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థల ద్వారా చూపించడం ఒక విచిత్రం. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై 80శాతం వరకూ సంత్రుప్తి ఉందంటూ తప్పుడు లెక్కలు అందచేశారు. వాటినే నిజమనుకుని భ్రమల్లో మునిగిపోయారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు పోటీయే కాదంటూ మనసా వాచా విశ్వసించారు. ఫలితంగానే ఇప్పటికీ అపజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సామాజిక
మాధ్యమాలు, రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ పరాజయానికి కారణాలను సరైన రీతిలోనే విశ్లేషిస్తున్నారు. వారసుడు లోకేశ్ అత్యుత్సాహం చూపుతూ సమాంతర పాలన నెలకొల్పుకోవడం, జన్మభూమి కమిటీలు, ఇసుక అక్రమ అమ్మకాల ద్వారా అవినీతి పెచ్చరిల్లి పోవడం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాపీ వంటి హామీలు ఏమాత్రం నిలబెట్టుకోలేకపోవడం కారణాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవ్వడం కూడా ఓటమికి కారణంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. గంటలతరబడి తాను చెప్పడం, ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప అధికారులు చెప్పేది వినే ప్రయత్నం చేయలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నానికీ పూనుకోలేదు.తెలుగుదేశం పార్టీకి అత్యంత నష్టం చేకూర్చింది కులమే. ఆంద్రాలో కులాల సమీకరణ సహజమే. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ప్రతిగా మిగిలిన కులాలు మెజార్టీగా సంఘటితం కావడం ఈ ఎన్నికలోనే సంభవించింది. దాదాపు కోటిన్నర మంది ప్రజలకు వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధి జరిగింది. 60 లక్షల పైచిలుకు కార్యకర్తలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఆ స్థాయిలో ఓట్లు
తెచ్చుకోలేకపోయింది టీడీపీ. ఇందుకు ప్రధాన కారణం ఒక కులానికే రాష్ట్రంలో న్యాయం జరుగుతోందనే భావన తీవ్రంగా వ్యాప్తి చెందడం, మిగిలిన కులాల్లో ఆగ్రహానికి కారణమైంది. మంత్రివర్గ పదవుల్లో అయిదో వంతు చంద్రబాబు నాయుడి కులమే ప్రాతినిధ్యం వహించింది. ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులోనూ 24 శాతం వరకూ అదే కులానికి ఇవ్వాల్సి రావడం చాలా వ్యతిరేక, ప్రతికూల ప్రభావం చూపింది. బహిరంగంగానే ఇతర కులాలు, ప్రజల ముందు టీడీపీని దోషిగా నిలబెట్టింది. ఈవిషయంలో వైసీపీ చాలా బ్యాలెన్స్ గా వెళ్లింది. అన్ని కులాలకు టిక్కెట్లు ఇచ్చినట్లు చూపించుకోగలిగింది. అసలే వివిధ రకాల కారణాలతో అసంత్రుప్తిగా ఉన్న ప్రజలు వ్యతిరేకంగా సంఘటితం కావడానికి ఒక కులమే అధికార లబ్ధి పొందుతోందన్న సెంటిమెంటు బలంగా పనిచేసింది. పసుపు కుంకుమ వంటి పథకాలను చివరి దశలోప్రవేశపెట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కేవలం 25 శాతానికే పరిమితమై ఉండేదనేది పరిశీలకుల అంచనా. కులము నష్టపరిస్తే పసుపు కుంకుమ పథకం కనీసం 40 శాతం ఓటు బ్యాంకుతో గౌరవం కాపాడింది. ఆయా కారణాలు తెలిసీ అంగీకరించడానికి మనస్కరించకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికే నష్టమంటున్నారు
విశ్లేషకులు. దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే టీడీపికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కారణాలు తెలియవంటూ కళ్లు మూసుకుంటే అంధకారబంధురమే.