వరంగల్‌లోని రీజనల్ కంటి ఆస్పత్రి అతిపెద్దది. హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆస్పత్రి తర్వాత రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ ఎంజీఎంకు ఎదురుగా ఉన్న ఈ ఆస్పత్రికి వరంగల్ చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఉత్తర తెలంగాణలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారంతా ఇక్కడికి వస్తుంటారు. ఈ నేత్ర వైద్యశాలకు ప్రతిరోజు 300 నుంచి 400 మంది ఔట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరితోపాటు కంటి పరీక్షల నిమిత్తం రోజు సుమారు 50 మంది వరకు ఆస్పత్రిలో అడ్మిట్ అవుతుంటారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ నేత్ర వైద్యశాల... ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతోంది. కంటి పరీక్షలు, ఆపరేషన్ కోసం వచ్చే రోగులు, వారి బంధువులకు ఈ ఆస్పత్రిలో ఎలాంటి వసతులు లేవు. వీటికి తోడు వైద్యుల కొరత వేధిస్తోంది. సరిపడ వైద్యులు లేకపోవడంతో రోగులకు సకాలంలో ఆపరేషన్లు జరుగడం లేదు. ఆపరేషన్ చేసిన వారికి మందులూ కూడా ఇవ్వడం లేదన్నది మరో ఆరోపణ. అదేమంటే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోండని వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు.కంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. ముందు పలు రకాలైన టెస్ట్‌లు చేయాలి. సరిపడ సిబ్బంది లేకపోవడంతో టెస్ట్‌లు చేయడం రోజలు తరబడి సాగుతోంది. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారా అనీ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కార్నియా, రెటీనా, గ్లోకోమా పరీక్ష కోసం ప్రత్యేక యూనిట్లను ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. కానీ వాటిని చేసేందుకు ప్రొఫెసర్లు, వైద్యులను నియమించలేదు. వైద్యుల కొరత ఉండడంతో ఈ యూనిట్లన్నీ దుమ్ము పట్టిపోయాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన విలువైన యంత్రాలు వృధాగా పడిఉన్నాయి.వరంగల్ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు గ్రూపులుగా విడిపోయి.. రోగులకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ఆధిపత్యం కోసం డాక్టర్లు తరచూ ఘర్షణ పడుతుంటారని చెప్తున్నారు. రోగులను పట్టించుకోవాల్సిన వైద్యులు గొడవలతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు.వరంగల్ కంటి ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేస్తే.. అక్కడ పనిచేస్తున్న వైద్యులు మాత్రం అదేంలేదని కొట్టిపారేస్తున్నారు. ఆస్పత్రిలో అసలు సమస్యలే లేవని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వరంగల్ ఐ ఆస్పత్రిపై దృష్టిసారించి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.