YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ వ్యూహామా...తొందరపాటా...

జగన్ వ్యూహామా...తొందరపాటా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అయిదేళ్ళ పాటు ప్రత్యేక హోదా పోరాటం జగన్ చేశారు. అప్పుడు విపక్షంలో ఆయన ఉన్నారు. మరో వైపు చంద్రబాబు హోదా విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం కూడా జగన్ మోహన్ రెడ్డి కి బాగా కలసివచ్చింది. దీంతో జగన్ హోదా పొరాట  వీరుడుగా ముద్ర పడ్డారు. ఇక చంద్రబాబుకు ఏ ఎండకూ ఆ గొడుకు పట్టే నైజంతో పాటు ఏపీలోని ఆర్ధిక పరిస్థితి, మోడీ తో ఢీ కొట్టే సాహసం చేయలేకపోవం, బలమైన వైసీపీ జనంలో ఉండడం వంటి అనేక అనివార్యతలు హోదా విషయంలో వెనక్కు తగ్గేలా చేశాయి. చివరి ఏడాది హోదా జపం చేసినా యూ టర్న్ తీసుకున్నా  జనం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చంద్రబాబు దారుణంగా ఒటమి పాలు అయ్యారు.జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. అయిదేళ్ళ పాటు హోదా పోరాటాన్ని నడిపారు. అపుడు కూడా విపక్ష నేతగా ప్రధాని మోడీని కలసి హోదా ఇమ్మని పదే పదే  విన్నపాలు చేసుకున్నారు. బందులు ధర్నాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ చేసి కూడా జగన్ హోదా విషయంలో ఎక్కడా కదలిక తేలేకపోయారు. దానికి చంద్రబాబు తప్పు ఎంత వుందో కేంద్రంలోకి మోడీ మొండితనం అంతే ఉంది. ఇపుడు చంద్రబాబు స్థానంలో జగన్ మోహన్ రెడ్డి వచ్చారు.
కాబట్టి బలంగా ముఖ్యమంత్రి హోదాలో హోదా వాణిని డిల్లీ వరకూ వినిపించగలరు. అంతవరకూ జగన్ సక్సెస్ అవుతారు. కానీ ఆ తరువాత పని కేంద్రానిది. అంటే మోడీ, అమిత్ షాలది. మరి వారు ఇదివరకు మాదిరిగానే మొండిగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి హోదా ఎలా సాధించగలరన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న.
ఇక హోదా విషయంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ   ఆమోదించింది. దీనికి చంద్రబాబు కూడా ఏ అభ్యంతరం లేకుండా మద్దతు ఇచ్చారు. ఇక్కడే చంద్రబాబు రాజకీయం చూపారనుకోవాలి. జగన్ కి 22 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి మీరు హోదాను తీసుకురండి సంతోషిస్తామని బాబు కాస్తా సెటైరికల్ గా మాట్లాడారు. అంటే తాను తేలేకపోయానని ఒప్పుకుంటూనే జగన్ మోహన్ రెడ్డి సైతం తేలేరన్న స్వరంతోనే బాబు ఈ మాట అన్నారనుకోవాలి. నిజంగా హోదా కనుక జగన్ తెస్తే బాబు రాజకీయం మరింతగా మసకబారడం ఖాయం. ఆ మాత్రం తెలియని వారు బాబు కాదు అనుకోలేం.జగన్ మోహన్ రెడ్డి కంటే కూడా బాబు మోడీని దగ్గరుండి చూశారు. మోడీ ఇవ్వరన్న ధీమాతోనే బాబు అలా  ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారన్నమాట. జగన్ మోహన్ రెడ్డి సైతం హోదా కోసం చివరి వరకూ పోరాటమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే జనాలు మాత్రం అయిదేళ్ళే టైం ఇస్తారు. చంద్రబాబు అయితే అది కూడా ఇవ్వరు, ఆరు నెలలు ఆగి ఏదీ హోదా జగన్ అంటూ వెంట పడతారు, అపుడు జగన్ మోహన్ రెడ్డి సంగతేంటి. ఓ విధంగా జగన్ పులి మీద స్వారీ చేస్తున్నారనుకోవాలి. లేదా మోడీతో బాబు కంటే దగ్గర చుట్టరికంతో  ధీమాగా హోదా  గురించి ముందుకు వెళ్తూండాలి. హోదా తోనే తన రాజకీయాన్ని ముడి వేసుకున్న జగన్ మోహన్ రెడ్డి ది వ్యూహమా. తొందరపాటా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది.

Related Posts