యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అమ్మఒడి పథకం అమలులో ప్రభుత్వ పాఠశాలలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా సురేష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల ప్రమోషన్ల ఫైలుపై రెండో సంతకం చేశారు. పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దుచేస్తూ మూడో సంతకం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంపై ప్రస్తుతం చర్చిస్తున్నామనీ, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో అక్రమాలను అరికడతామనీ, నిష్ణాతులైనవారినే వీసీలుగా నియమిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎడ్యుకేషనల్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నారు.