యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో అధికారం మారింది. దీంతో టీడీపీ తల రాత కూడా మారుతుందా ? ఇప్పటికే చావు తప్పిన విధంగా కేవలం 23 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాను అతి కష్టంమీద దక్కించుకున్న టీడీపీకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఏర్పడనుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఎంపీలను, 23 మంది ఎమ్మెల్యేలను దక్కించు కున్న టీడీపీ ఇప్పుడున్న పరిస్థితిలో అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పరీక్షా కాలాన్నే ఎదుర్కొంటున్నారని చెప్పాలి.ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను అలవోకగా ప్రోత్సహించిన చంద్రబాబు తెలంగాణలో పూర్తిగా పార్టీని నాశనం చేసుకున్నారు. డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే పార్టీ మారిపోయారు. ఇక, మిగిలిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఎప్పుడు గోడదూకుదామా ? అని ఎదురు చూస్తున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఒకవైపు బీజేపీ, మరో వైపు అధికార వైసీపీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమవైపు చూస్తున్నారని ప్రకటించి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఏకంగా బీజేపీ అయితే, విజయవాడ నుంచి గెలిచిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని లైన్‌లో పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.నాని వ్యవహార శైలీతో పాటు ఆయన చంద్రబాబుకు తన ఫేస్‌బుక్ పోస్టులతో తలనొప్పిగా మారడంతో చాలా అనుమానాలు తెప్పిస్తోంది. ఇక, వైసీపీ కూడా ఈ నెల 20 తర్వాత ద్వారాలు తెరుస్తామని, వచ్చేవారు ఎవరైనా రావాలని ప్రకటించింది. అయితే, ఈ క్రమంలో ఒకింత చంద్రబాబు నాయుడు కు ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. అలా వచ్చే వారు తమ పదవులకు, పార్టీకి కూడా రాజీనామాలు సమర్పించాలని జగన్ షరతు విధించడమే. దీనికి కూడా సిద్ధమైతే.. చంద్రబాబు నాయుడు మాత్రం చేసేది ఏమీ ఉండదు. టీడీపీ నుంచి గెలిచి… వైసీపీలోకి వెళ్లాలనుకునే వారు తమ ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకోవాల్సి ఉంటుంది. గెలిచిన వారు పదవులు వదులుకోవాలి… అదే గెలవని వారు సులువుగానే గోడ దూకేయొచ్చు. ఇదే జరిగితే టీడీపీలో ఓడిన వాళ్లలో చాలా మంది వైసీపీలోకి వెళ్లిపోతారు.ఇక, బీజేపీ విషయానికి వస్తే.. తమకు టచ్‌లో రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు సహా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ప్రకటించింది. ఏపీకి చెందిన ఆ పార్టీ నేత విష్ణువర్థన్‌రెడ్డి సయంగా ఈ ప్రకటన చేయడంతో టీడీపీ నేతలకు బీజేపీ నుంచి కూడా ఒత్తిళ్లు ఉండబోతున్నాయ్ అన్నది స్పష్టమైంది. ఇది మరింతగా చంద్రబాబు నాయుడు ను ఆందోళన పరిచేవి షయం. మోడీని ఓడించాలంటూ.. దేశం మొత్తం తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు పై కసి తీర్చుకునేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో ఏక్షణాన ఏం జరుగుతుందోనని టీడీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఏదేమైనా ఐదేళ్ల పాటు ఇక్కడ వైసీపీ, కేంద్రంలో బీజేపీని తట్టుకుని టీడీపీ కేడర్, నాయకులను కాపాడుకోవడం చంద్రబాబు నాయుడు కు కత్తిమీద సాములా మారింది.