యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పనులు ముందస్తు కార్యాచరణకు తగ్గట్టుగా ఇంకా ఊపందుకోలేదు. తూర్పు గోదావరి జిల్లాల్లో ఆరు లక్షల మంది రైతుల్లో 80 శాతం వరకు కౌలు రైతులే. భూములు కలిగిన మోతుబరి రైతులు పిల్లల చదువుల కోసం పట్టణాలకు చేరితే కౌలు రైతులు అధిక శాతం సాగు చేస్తున్నారు. అయితే కౌలు రైతులకు పెట్టుబడులు సమకూరని స్థితిలో ప్రైవేటు అప్పుల బారిన పడి సతమతమవుతున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలను ఇంకా పూర్తి స్థాయిలో అందించలేకపోయింది. దీంతో ఖరీఫ్ పెట్టుబడులు సమకూర్చుకోలేని స్థితి కాస్తా ముందస్తుకు సిద్ధం కాలేని పరిస్థితి కన్పిస్తోంది. కౌలు రైతులు అధిక వడ్డీలతో అప్పులపాలయ్యే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన వేల కోట్ల ఖరీఫ్ రుణ ప్రణాళిక కౌలు రైతుల దరి చేరలేదు. ఈ ఏడాది రూ.4257 కోట్ల మేర రుణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటి వరకు కౌలు రైతులకు కేవలం రూ.130 కోట్ల వరకే రుణాలు అందినట్టు తెలుస్తోంది.నిర్దేశిత కార్యాచరణ ప్రకారం జూలై నెలాఖరుకల్లా నాట్లు పూర్తి కావాల్సి వుంది. అధికారులైతే ప్రస్తుతం 71 శాతం వరకు ఆకుమడులు పూర్తయినట్టు చెబుతున్నారు. కానీ మెట్ట, మైదాన ప్రాంతాల్లో బోర్ల కింద సాగుచేసే ప్రాంతాల్లో సైతం ఇంకా నారుమడులు పూర్తి కాలేదు. ఇపుడిపుడే భూమిని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. సంబంధిత శాఖ అధికార యంత్రాంగం పరంగా ముందస్తు కార్యాచరణకు రైతాంగాన్ని సమాయత్తం చేసినట్టు కన్పించడం లేదు.ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించింది. కాల్వలకు నీరు విడుదల చేశారు. డెల్టాలో శివారు ప్రాంతాలకు కూడా నీరు చేరుకుంటోంది. ఆధునీకరణ పనుల వల్ల, తూడు పెరిగిపోయిన కాల్వ కింద పనులు మందగించాయి. మెట్ట, ఏజెన్సీ, డెల్టాలో ఖరీఫ్ పనులు ఆరంభమయ్యాయి గానీ ముందస్తు వేగంతో మాత్రం జరగడం లేదు. జిల్లాలో 5.75 లక్షల ఎకరాల్లో వరి పండించాలని వ్యవసాయ రైతులను సమాయత్తం చేసింది. దాదాపు పదివేల ఎకరాల్లో మొక్కజొన్న, 30 వేల ఎకరాల్లో తృణ ధాన్యాలు, 52 వేల ఎకరాల్లో ప్రత్తి, 50 వేల ఎకరాల్లో చెరకు పండించాలని నిర్దేశించారు. దాదాపు 200 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిన పండించాలని కసరత్తు చేశారు. జూలై నెలాఖరుకు నాట్లు పూర్తయితే నవంబర్ రెండో వారానికి పంట కోతకొస్తుందని వ్యవసాయ అంచనా వేస్తోంది. ఈ ఖరీఫ్‌లో 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. గ్రామీణ విత్తనోత్పత్తి ద్వారా పదివేల క్వింటాళ్లు, ఎపి సీడ్స్ ద్వారా 28 వేల క్వింటాళ్లు, ప్రైవేటు డీలర్ల నుంచి 55 వేల క్వింటాళ్లు, రైతుల ద్వారా 14 వేల క్వింటాళ్లు అందుబాటులో వుంచారు. 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా అంచనా వేశారు. ప్రస్తుతం 53 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో వున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఖరీఫ్ పనులు మరింత ఊపందుకోవాల్సి వుంది.