యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విభజన చట్టంలో కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఇస్తామని చెబితే కాదు మేమే కట్టుకుంటామని ఒప్పుకుని ఎపి ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెట్టింది గత టిడిపి సర్కార్. ప్రాజెక్ట్ పూర్తి చేసి అదిగో నీళ్ళు ఇదిగో నీళ్ళు అంటూ 2018 నుంచి తేదీలు మారుస్తూ వచ్చింది బాబు ప్రభుత్వం. పైగా మా ప్రతాపం పోలవరంలో చూడండి అంటూ అసలే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సులను పోలవరానికి తిప్పి ఉచిత భోజన సదుపాయాలతో సుమారు వందకోట్ల రూపాయలను గోదావరిలో పోసేసింది. తీరా పోనీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందా అంటే అదీ లేదు. కేంద్రం వేసిన ఎన్నో కొర్రీలకు సమాధానమే లేదు. ప్రాజెక్ట్ అధారిటీ ఒకటి చెబితే సర్కార్ మరొకటి చెప్పి ప్రజలను అయోమయానికి గురిచేసి చివరికి ప్రజల చేత చీత్కారానికి గురైంది బాబు ప్రభుత్వం.
వేలకోట్ల రూపాయలు అవసరం వున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రం కొనసాగిస్తే ఖజానాపై పెనుభారం పడుతుంది. అలా అని కేంద్రాన్ని కట్టించి ఇమ్మని అడిగితె ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టత ఉండదు. ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ప్రతిపక్షానికి 2024 ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా పోలవరం పనికొస్తుంది. తాము తిరిగి అధికారం లోకి వచ్చి ఉంటే ఈ పాటికే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి ఉండేదని విమర్శలు ఆరోపణలకు అవకాశం ఇచ్చినవారు అవుతారు. మరో పక్క స్వర్గీయ వైఎస్ కలను కుమారుడిగా పూర్తి చేయలేదన్న అపవాదును ఎదుర్కొవాలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం పై ముఖ్యమంత్రి జగన్ తీసుకోనున్న నిర్ణయం ప్రాజెక్ట్ భవితను రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదిగా మారింది. మరి దీనిపై నవయువ సిఎం ఎలాంటి అడుగు వేస్తారా అని ఎపి వాసులు ఎదురు చూస్తున్నారు.