యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అటు ఢిల్లీ, ఇటు ఏపీ కేంద్రంగా జరగిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీని నిలువునా ఇబ్బంది పెట్టాయి. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి జల్ల కొట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు, నేరుగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్దకు వెళ్లి.. తాము చేరుతున్నట్టు, తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని వారు అభ్యర్థించారు. ఈ పరిణామంతో ఏపీ రాజకీయాల్లో సంచలనం ఏర్పడింది..లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిన మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక్క కర్ణాటకలోనే కమలం వికసించింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలుపొందిన బీజేపీ.. ఏపీలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఏపీలో బలపడటం కోసం టీడీపీకి చెందిన కీలక నేతలకు గాలం వేస్తోంది. ఆపరేషన్ కమలంతో ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతల మాటలను బట్టి చూస్తే.. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది. టీడీపీని మొత్తం ఖాళీ చేసి.. ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని తానే భర్తీ చేయాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఆ పార్టీ ఫోకస్ పెట్టిందని భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరంతా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని కాపు నేతలను ముందుగా పార్టీలో చేర్చుకొని... తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. టీడీపీ ఏర్పాటు నుంచి కమ్మ సామాజికవర్గం ఆ పార్టీని తమదిగా భావిస్తోంది. 2014 ఎన్నికల్లో కాపులు సైకిల్‌కి జైకొట్టారు. టీడీపీని ఇంటిపార్టీగా భావించే సామాజిక వర్గం నేతల్ని, సంఖ్యాపరంగా ఏపీలో ఎక్కువగా ఉన్న కాపు నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా బలపడాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.అంతేకాదు, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి తిరిగి వచ్చే సరికి బీజేపీ తగిన విధంగా ఆయన గిఫ్ట్ రెడీ చేస్తోందని నర్మగర్భంగా వ్యాఖ్యలు సంధించారు. అంటేదీనిని బట్టి .. టీడీపీ నుంచి అటు ఎమ్మెల్యేలను, ఇటు ఎమ్మెల్సీలను కూడా భారీ సంఖ్యలో బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంటుందనే సంకేతాలను ఆయన ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే నలుగురు కీలకమైన ముఖ్యంగా చంద్రబాబు అత్యంత సన్నిహితులుగా మెలిగిన నాయకు లు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని అంటున్నారు.ఇక బాబుపై సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీ మారిపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో అటు తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే చంద్రబాబు తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన పరోక్షంగా వైసీపీ ఏపీలో గెలిచేందుకు సహకరించారనేది వాస్తవం. ఇక, పైకి చెప్పకుండానే కేసీఆర్ మాదిరిగానే ఇప్పుడు ఎన్నికల అనంతరం, చంద్రబాబును అణిచేసేందుకు, టీడీపీకి కనీస హోదా కూడా లేకుండా చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు.ఈ క్రమంలోనే విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. ఎన్నికలకు ముందు వరుసపెట్టి బీజేపీపై ఎటాక్ చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ ఏం చేసినా కనీసం ప్రెస్‌మీట్ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలను తన పార్టీలోకి తీసుకున్నప్పుడు వైసీపీ అధినేత చావు కేకలు పెట్టినా ఆయన పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఏమొహం పెట్టుకుని తన ఎమ్మెల్యేలను తీసుకున్న బీజేపీపై వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ప్రధాన ప్రశ్నే..! ఏదేమైనా ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది… దీనిని ఇప్పట్లో అయితే టీడీపీ ఎదుర్కొనే పరిస్థితిలో లేదు.